నల్లగొండ, ఫిబ్రవరి 12 : ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా ఆరు నుంచి ఎనిమిది నెలలుగా వేతనాలు లేక ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆకలితో అలమటిస్తున్నారు. కూటి కోసం అప్పులు చేసి వచ్చే వేతనం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సర్కార్ నిదులు విడుదల చేయడం లేదని ఏజెన్సీలు చేతులెత్తేస్తే అధికారులు మాత్రం ముఖం చాటేస్తున్నారు. దాంతో వారు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాని పరిస్థితుల్లో అయోమయంలో పడ్డారు. డ్యూటీ విషయంలో నిక్కచ్చిగా ఉండే అధికారులు వేతనాల విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ సర్కార్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏజెన్సీలే ఇవ్వాలని మాట చెబుతున్నారు. హెల్త్, ఐబీ, రూరల్ వాటర్, గురుకుల, విద్యా, వెటర్నీరీ ఇలా చెప్పుకుంటూ పోతే ఏ శాఖలో కదిలించినా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బాధలు వర్ణనాతీతం. అట్లని నిగ్గదీస్తే ఉన్న ఉద్యోగం పోద్దేమనే భయంతో వెనకడుగు వేస్తున్న పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో సుమారు మూడు వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీవనం అగమ్యగోచరంగా మారింది.
ప్రభుత్వ శాఖల్లో రెగ్యులర్ ఉద్యోగులను నియమించని సర్కారు తాత్కాలిక అవసరాలను తీర్చుకోవడానికి గతంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించేది. కాలానుగుణంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ కోసం పోరు చేస్తున్న నేపథ్యంలో ఆ వ్యవస్థను పక్కన పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా శాఖల వారీగా ప్రైవేటు ఏజెన్సీలకు కాంట్రాక్ట్ అప్పచెప్పి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా తాత్కాలిక అవసరాలను తీర్చుకుంటున్నది. అందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో ల్యాబ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఆఫీస్ సబార్డినేటర్లు, ఆర్డబ్యూఎస్లో నీటి సరఫరా సిబ్బంది, గురుకులాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది.. ఇలా ప్రతి శాఖలో ఏదో ఒక హోదాలో పని చేస్తూ కాలం వెల్లదీస్తున్న ఈ చిరుద్యోగులకు ఏజెన్సీలు సకాలంలో వేతనాలు ఇవ్వడం లేదు. ఒక్కో శాఖలో ఆరు నుంచి ఎనిమిది నెలలుగా వేతనాలు అందడం లేదు. ఈ విషయమై కలెక్టర్ దృష్టికి పలు సంఘాలు తీసుకెళ్లినప్పుడు మాత్రమే స్పందించిన ఏజెన్సీలు ఒకటి రెండు నెలలు ఇచ్చి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారింది.
ఇచ్చేది అరకొర వేతనం, అందులోనే పలు రకాల కోతలతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. పలు శాఖల్లో పర్యవేక్షణ కారణంగా కింది స్థాయిలో అనేక సమస్యలు వస్తున్నాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విధుల విషయంలో కఠినంగా ఉండే సర్కార్ ఎందుకు వేతనాలు సకాలంలో ఇవ్వడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా గురుకుల విద్యా సంస్థల్లో అనేక ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగుల విధులపై సీరియస్నెస్ చేసిన సర్కార్ వారి వేతనాలు మాత్రం సమయానికి ఇవ్వకపోవడం గమనార్హం. ఇక వారికి వేతనాలు ఇచ్చే ఏజెన్సీలు పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. కొందరి ఉద్యోగుల వేతనం ప్రభుత్వమే నేరుగా ప్రిన్సిపాళ్ల ఖాతాల్లో వేస్తుండగా పలు కారణాలతో కోతలు పెట్టి డబ్బులు ఇస్తున్నారట. మరికొన్ని శాఖల్లో కొందరి ఉద్యోగులకు పీఎఫ్ కూడా చెల్లించడం లేదని, ఫలితంగా వారి ఖాతాలు క్లియర్ కావడం లేదని విమర్శలు వస్తున్నాయి.
ఆయా శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు రూ.10 వేల నుంచి రూ. 19,500 వరకు నెల వేతనంగా అందుతుంది. దానితో కడుపునింపుకొనే వారికి ఏడెనిమిది నెలలుగా ఏజెన్సీలు వేతనాలు ఇవ్వకపోవడంతో అప్పులు చేయాల్సి వస్తున్నది. నెల తిరిగే సరికే పిల్లల ఫీజుల, ఇతర ఇంటి ఖర్చుల నేపథ్యంలో జీవితం భారంగా మారి ఇబ్బంది పడుతున్నారు. చేసిన అప్పులు సకాలంలో చెల్లించకపోవడంతో మరోసారి అప్పు పుట్టని పరిస్థితి నెలకొందని పలువురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని శాఖల్లో ఏజెన్సీలు మానవతా దృక్పథంతో వేతనాలు ఇస్తున్నా ఎనిమిది నెలలుగా ఇవ్వడంతో వారికి కూడా భారంగా మారిందనే చెప్పొచ్చు. కొన్ని శాఖలో ఏజెన్సీలకు కొంత డబ్బు ఇస్తేనే వేతనాలు ఇస్తున్నట్లు తెలుస్తున్నది.