సూర్యాపేట, జూన్ 6 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట జనరల్ దవాఖానలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పీఎఫ్, ఈఎస్ఐ సొమ్ము కాజేశారని ఇటీవల నమస్తే తెలంగాణ పత్రికలో వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. అది ఆ ఒక్కచోటే కాదు…దాదాపు అన్ని శాఖల్లో పని చేస్తున్న చిరు ఉద్యోగుల సొమ్ము ను కాజేసినట్లు పలువురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ అక్కౌంట్లు చూసుకొని ఫోన్లు చేసి చెబుతున్నారు. తాము సమాచారం ఇచ్చామని బయటకు వస్తే ఉద్యోగాలు తీసేస్తారని వాపోతుండటం గమనార్హం. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా దాదాపు 57 ఏజెన్సీలు ఉన్నాయి.
ఉద్యోగులకు చెల్లించాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ సుమారు రూ.నాలుగున్నర కోట్లు చెల్లించలేదు. ప్రస్తుతం ఏజెన్సీలను రెన్యూవల్ చేయాల్సి ఉండగా లక్షల్లో మామూళ్లు ముట్టజెపితే ఆయా శాఖల హెచ్వోడీలు శాటిస్ఫాక్టరీ సర్టిఫికెట్లు ఇస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇంత జరుగుతున్నా, అక్రమాలపై పత్రికల్లో కథనాలు వచ్చినా విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిన పాలనాధికారి కనీసం పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలు రానివారు, వివిధ రంగాల్లో స్కిల్ ఉన్నవారు పొట్ట కూటి కోసం ప్రభుత్వ శాఖల్లో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా రిక్రూట్ అయి విధులు నిర్వహిస్తుంటారు. ఇలాంటి వారికి ఉద్యోగ భద్రతతో పాటు పనికి తగిన వేతనం ఇస్తారు. ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లిస్తారు.
ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేండ్ల హయాంలో నిరంతరం నిక్కచ్చిగా కొనసాగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఎవరికి వారు దొరికిన కాడికి దోచుకో అన్న చందంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తామే సర్వ స్వతంత్రులం అనే చందంగా వ్యవహరిస్తూ ఏజెన్సీలకు కాంట్రాక్టులు అప్పగించడంలో నెలల తరబడి ఆలస్యం చేయడం, వేతనాలు ఇవ్వక ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏకంగా రోడ్లెక్కి నిరసనలు, ధర్నాలు చేసిన ఉదంతాలు ఉన్నాయి. ఏదో విధంగా ఏజెన్సీలకు కాంట్రాక్ట్ అప్పగించిన తరువాత వాటి పని తీరును పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు.
రూ.నాలుగున్నర కోట్లు స్వాహా
జిల్లా వ్యాప్తంగా 57 ఏజెన్సీల పరిధిలో దాదాపు 2,200 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరికి 2025 ఏప్రిల్ నుంచి 2025 సెప్టెంబర్ వరకు పీఎఫ్, ఈఎస్ఐ సొమ్మును పది శాతం ఏజెన్సీలు మినహా మిగిలిన వారు చెల్లించలేదని తెలిసింది. కేవలం రూ.15 వేల వేతనం తీసుకునే ఒక ఉద్యోగి నెల ఒక్కంటికి జీతంలో 12 శాతం కట్ చేస్తుండగా 13 శాతం ప్రభుత్వం ఇస్తుంది. ఇలా నెల ఒక్కంటికి మొత్తం రూ.3,600 చెల్లిస్తారు. ఉద్యోగి నుంచి కట్ చేసిన 12 శాతంతో పాటు ప్రభుత్వం ఇచ్చే 13 శాతం మొత్తం డ్రా చేసి పక్కదారి పట్టించారని విశ్వసనీయం గా తెలిసింది.
జిల్లాలోని 2,200 మందికి ఆరు నెలలకు కలిపి దాదాపు రూ.4.50 కోట్లు ఎటు వెళ్లాయో ఆ దేవుడికే ఎరుకని పలువురు పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో కొద్ది నెలల పాటు వేతనాలు రాకపోవడం, తదనంతరం ఈ ప్రభుత్వంలో ఏజెన్సీలు దక్కించుకున్న వారు పీఎఫ్ రెన్యూవల్ కోసం జరిమానా పడుతుందని, వాటిని చెల్లించేందుకు ఒక్కో ఉద్యోగి నుంచి రూ.5 వేలు తీసుకున్నారు.
ఇలా కోట్ల రూపాయలను తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా రాజకీయ నాయకులు, అధికారులు, ఏజెన్సీలు పంచుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా యి. ఇంత జరుగుతున్నా పాలనాధికారి పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం మూడు నెలల పాటు ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్‌లను రెన్యూవల్ చేయగా ఆయా శాఖల నుంచి శాటిస్ఫాక్టరీ సర్టిఫికెట్లు ఇస్తున్నారని సమాచారం. పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించకున్నా సర్టిఫికెట్లు ఇస్తుండటంపై పెద్ద ఎత్తున చేతులు మారుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి ఉద్యోగులకు చెందిన డబ్బును వారి ఖాతాల్లో జమ చేయించడానికి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.