రాజకీయ లబ్ధి కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటమా!బండి సంజయ్‌ది ఇంత చిల్లర తనమా?ఎమ్మెల్యే రఘునందన్‌రావు అతి తెలివి వ్యాఖ్యలపై విస్మయం 2 గంటల్లోనే పరీక్ష హాల్ నుంచి రావచ్చా అంటూ ప్రశ్నల వర్షం చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ కుయుక్తులు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మానసిక ఆందోళనకు గురిచేస్తున్న కమలం నేతలు కలత చెందుతున్న ఉపాధ్యాయ వర్గం లీకేజీ గుట్టును నిగ్గుతేల్చిన సర్కారు సమర్థతపై ప్రశంసల జల్లు
పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ అంటే కొద్దిరోజులు ముందుగానో, కొన్ని గంటల ముందుగానో బయటకొస్తే దాని ఆధారంగా పరీక్షలు రాసిన వారు ఫలితాల్లో ప్రయోజనం పొందుతారు. కానీ ఇటీవల పదో తరగతి హిందీ పరీక్ష లీకేజీ వ్యవహారం ఇందుకు భిన్నంగా ఉండడం విస్మయానికి గురిచేస్తున్నది. పరీక్ష ప్రారంభమయ్యాక ప్రశ్నాపత్రాన్ని ఉద్దేశపూర్వకంగా బయటకు తెచ్చి, సోషల్ మీడియాలో ప్రచారంలో పెట్టడం వల్ల ఎవరికి ప్రయోజనమన్నది చర్చనీయాంశంగా మారింది. అప్పటికే పరీక్ష హాల్లో ఉన్న విద్యార్థులకు పేపర్ లీకేజీ వల్ల వీసమెత్తు ప్రయోజనం లేదన్నది స్పష్టం. మరి ఏ ప్రయోజనాల కోసం బీజేపీ నేతలు ఈ నీచపు పనులు చేస్తున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కేవలం ప్రభుత్వాన్నిఅప్రతిష్ట పాలు చేయడానికి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతారా అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 15ఏండ్లు కూడా నిండని పదో తరగతి విద్యార్థులను గందరగోళపర్చి, వారి తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురిచేయడంతోపాటు పరీక్ష నిర్వహణలో భాగమైన విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయుల ఆత్మైస్థెర్యం దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న కమలం నేతల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్‌ను అడ్డం పెట్టుకుని క్షుద్ర రాజకీయాలకు పాల్పడడాన్ని విద్యార్థుల తల్ల్లిదండ్రులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, మేధావులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
పరీక్ష మొదలైన రెండు గంటల్లోనే విద్యార్థులు బయటకు రావచ్చు, పేపర్ కూడా రావచ్చంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు చేసిన అతి తెలివి వ్యాఖ్యలపైనా మండిపడుతున్నారు. పరీక్ష సమయం పూర్తయ్యాకే విద్యార్థులను బయటకు పంపిస్తారన్న కనీస అవగాహన లేకపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి సమాజానికి మీరిచ్చే సందేశం ఇదేనా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా పాలన సాగిస్తుంటే బీజేపీ నేతలకు ఇంత కంటగింపు ఎందుకన్న చర్చ సర్వత్రా సాగుతున్నది. మరోవైపు బీజేపీ నేతల కుట్రలను ఛేదిస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మనోైస్థెర్యం దెబ్బతినకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతు లభిస్తున్నది. బీజేపీ నేతల తీరుపై గురువారం కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
నల్లగొండ ప్రతినిధి/యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీకి కుట్ర పన్నిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆయనకు సపోర్టు చేస్తున్న ఆ పార్టీ నేతల తీరుపై ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. పిల్లల భవితవ్యంతో చెలగాటమాడుతూ రాజకీయ కుట్రకు తెరతీయడంపై అన్ని వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మేధావులు, విద్యావేత్తలు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. పిల్లల జీవితాలతో రాజకీయమా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు. బండి సంజయ్ కుట్రలతో ఒక రకమైన ఆందోళనకు లోనవుతున్నారు. ఇంకోవైపు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు అనవసర కళంకం అంటగడుతున్నారని కలత చెందుతున్నారు. తాము చేయని తప్పునకు.. బీజేపీ కుట్రలు తమను బలి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారం కోసం భావిభారత పౌరుల భవిష్యత్‌తో ఆటలు ఆడిన బండి సంజయ్‌ను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ సర్వత్రా వెల్లువెత్తుతున్నది.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుస్తున్నది. రెండు కండ్ల మాదిరిగా అటు అభివృద్ధి, ఇటు సంక్షేమంలో దూసుకెళ్తున్నది. ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా సీఎం కేసీఆర్ ప్రజల మెప్పు పొందుతున్నారు. ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్కు తిరుగుండటంలేదు. పైగా దేశ రాజకీయాల్లో బీజేపీ సర్కార్ వైఫల్యాన్ని ఎండగట్టడంలో ముఖ్యమంత్రి దూసుకుపోతున్నారు. పలు రాష్ర్టాల్లో ఆయన నాయకత్వం పట్ల ఆకర్షణలు పెరిగాయి. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో సైతం తెలంగాణ తరహా పాలన కావాలని ప్రజలు బలంగా తిరుగుబాటు చేస్తున్నారు. దీంతో సహించలేని మోదీ సర్కార్‌తోపాటు బీజేపీ పెద్దలు రాష్ర్టాన్ని అస్థిర పర్చాలన్న కుట్రలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఏదైనా తప్పును ఆసరాగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డుకుంటే బాగుండు. కానీ.. ఏమీ దొరకక విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడేందుకు కుట్రలు చేశారు. పరీక్షలను అడ్డం పెట్టుకుని లీకేజీల పేరుతో రాజకీయ కుట్రకు తెరలేపారు. ఇందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అడ్డంగా దొరికిపోవడంతోపాటు ఏ1 నిందితుడిగా పట్టుబడ్డారు. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు ఆ పార్టీ నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో దుర్మార్గమైన రాజకీయాలకు పాల్పడుతున్నారు.
విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం
ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు మంచి చదువులు చదివి, భవిష్యత్‌లో మంచిగా స్థిరపడాలని కోరుకుంటారు. అందుకు పదో తరగతి పునాది రాయిలాంటిది. ఇందుకోసం పిల్లలకు తల్లిదండ్రులు అన్ని విధాలుగా సంసిద్ధం చేసి పరీక్షలకు పంపిస్తారు. కానీ.. బండి సంజయ్ రాజకీయ కుట్రలతో విద్యార్థుల తల్లిదండ్రులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తమ పిల్లల జీవితాలే దొరికాయా అన్న ప్రశ్నలు సంధిస్తున్నారు. ఏడాది నుంచి కష్టపడి చదివితే పరీక్షల సమయంలో ఏకాగ్రతకు భంగం కలిగేలా బీజేపీ నేతల తీరుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దని విద్యార్థుల తల్లిదండ్రులు బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు.
ఉపాధ్యాయులకు కళంకం
ఉపాధ్యాయులు ఎంతో మంది విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తారు. పరీక్షల నిర్వహణలోనూ వారిదే కీలక పాత్ర. రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరిద్దరిని ప్రేరేపించి మొత్తం ఉపాధ్యాయ లోకానికి కళంకం తెచ్చేలా చేయడమేంటని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు పరీక్ష పత్రం బయటకు రావడం వెనుక బీజేపీ కుయుక్తులే ఉన్నాయన్న విమర్శలు తెలిసిందే. హిందీ ప్రశ్నాపత్రం కిటీకీలోంచి బయటకు రావడానికి, ఉపాధ్యాయుడికి ఎలాంటి సంబంధం లేకపోయినా పరీక్షల నిర్వహణ నిబంధనల ప్రకారం చర్యకు గురికాక తప్పలేదు. వీరి చర్యల వల్ల పలువురు ఇన్విజిలేటర్లు, ఇతర బాధ్యులు సైతం ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. రాజకీయాల కోసం బీజేపీ చేసిన కుట్రలపై ఉపాధ్యాయ లోకం తీవ్రంగా కలత చెందుతున్నది. బీజేపీ నీచ రాజకీయంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి.
సర్కారు కఠిన చర్యలు
బండి సంజయ్‌తోపాటు బీజేపీ నేతల కుట్రలను ఎప్పటికప్పుడు చేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరిస్తున్నది. లీకేజీ జరిగిన క్షణాల్లోనే అప్రమత్తమైన పోలీసులు లీకేజీ ఎక్కడ జరిగింది.. ఎవరి హస్తం ఉంది? కుట్రకు పాల్పడింది ఎవరు.. ఎందుకు చేశారు? అనే కోణాల్లో విచారణ జరిపి నిగ్గు తేల్చారు. వెంటనే ఇందులో భాగస్వాములైన వారి బాగోతాన్ని బట్టబయలు చేశారు. అసలు కుట్రదారులను గంటల్లోనే గుర్తించారు. ఓ వైపు పరీక్షలకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తూనే.. మరో వైపు లీకేజీ కారకులను అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు. సర్కారు తక్షణమే స్పందించిన తీరు, సమర్థతతో ఎదుర్కొన్న విధానంపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యావంతులు, వివిధ రంగాల్లోని ప్రముఖులు బీఆర్ఎస్ సర్కార్ తీరును అభినందిస్తున్నారు.
బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం
కేతేపల్లి, ఏప్రిల్ 6 : పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీకి కారకులైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తోపాటు మిగిలిన నిందితులను కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు వంటల చేతన్‌కుమార్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం సంజయ్‌కు తగదన్నారు. సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనే శక్తి లేక అడ్డదారుల్లో ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు వి.కళ్యాణ్, ఎ.మధు, సాయి, మణి, గంగరాజు, శివ, మల్లేశ్, గణేశ్, రాకేశ్ పాల్గొన్నారు.
అనర్హత వేటు వేయాలి : ఏఐఎస్ఎఫ్
మునగాల, ఏప్రిల్ 6 : పదో తరగతి పేపర్ లీకేజీ ఘటనలో నిందితుడిగా పట్టుబడ్డ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌పై పార్లమెంట్ స్పీకర్ తక్షణమే అనర్హత వేటు వేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా మాజీ కార్యదర్శి సీహెచ్ సీతారాం డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో గురువారం పదో తరగతి విద్యార్థులతో కలిసి ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరిగిన సంఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ బీజేపీ నుంచి సంజయ్‌ను తొలగించాలన్నారు. రాజకీయాల కోసం లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడం సరికాదన్నారు. రాజకీయంగా పాలక ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక తప్పుడు దారుల్లో విద్యార్థులను, నిరుద్యోగులను ఇబ్బందులకు గురి చేయడమేంటని ప్రశ్నించారు. నీతిమాలిన కుట్రకు తెరతీసిన బండి సంజయ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి శివ, ఏఐవైఎఫ్ జిల్లా కౌన్సిల్ సభ్యుడు కాసర్ల రాజేశ్, నాయకులు ముస్తఫా, తాళ్లూరి త్రినాథ్, ముత్యాల యశ్వంత్, జగదీశ్, శివ, గురుత్వాన్, వెంకటేశ్, వాసు, ప్రవీణ్ పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్ర
నల్లగొండ రూరల్, ఏప్రిల్ 6 : రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్రలు పన్నుతున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున అన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను నాశనం చేసే విధంగా పేపర్ లీకేజీలు చేసిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మను గురువారం జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల ఎదుట దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ కుట్రలను పసిగట్టిన పోలీసులు అందుకు కారకుడైన బండి సంజయ్‌ను అరెస్టు చేశారన్నారు. టీఎస్పీఎస్సీ, పదో తరగతి పేపర్లు లీక్ చేసిన బండి సంజయ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసి జీవిత కాలం జైలులో పెట్టాలని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా స్పందించి బండిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే హైదరాబాద్ పర్యటనలో మోదీ తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు నోముల శంకర్, అరవింద్, క్రాంతి, కిరణ్, నాగరాజు, కోటేశ్వర్రావు, సతీశ్, పవన్, శంకర్, లింగస్వామి, వెంకన్న, అశోక్, శ్రీశైలం, ఆంజనేయులు, యాదగిరి, శ్రీకాంత్ పాల్గొన్నారు.
-బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగార్జున
‘బండిని కఠినంగా శిక్షించాలి’
నకిరేకల్, ఏప్రిల్ 6 : పదో తరగతి వార్షిక పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ కుట్రదారుడు బండి సంజయ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నకిరేకల్‌లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో గురువారం ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ పట్టణ యూత్ అధ్యక్షుడు వంటెపాక నరేశ్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్‌తో బండి సంజయ్ చెలగాటమాడుతున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సైదిరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ వినయ్, బీఆర్ఎస్వీ పట్టణాధ్యక్షుడు వెంకటేశ్‌ప్రసాద్, ఉపాధ్యక్షుడు కొండ అజయ్, నాయకులు గుడుగుంట్ల సైదులు, ఆరుట్ల శ్రవణ్, కల్లూరి సంతోష్ పాల్గొన్నారు.
లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షించాలి
ప్రత్యేక రాష్ట్రంలో విద్యా రంగంలో ఎంతో ముందుకు పోతున్న తరుణంలో కొంత మంది స్వప్రయోజనాల కోసం 10వ తరగతి ప్రశ్నా పత్రాలను లీక్ చేసి ఉపాధ్యాయులను బలి చేయడం సరికాదు. పేపర్ లీకేజీ వల్ల విద్యార్థులు ఎంతో ఆందోళనకు గురవుతున్నారు. మంచిగా చదివే విద్యార్థులు కూడా అయోమయానికి లోనవుతున్నారు. ఉపాధ్యాయులెవరూ లీకేజీలను సమర్థించడం లేదు. కానీ.. ఎవరో చేసిన తప్పులకు ఉపాధ్యాయులు బలి అవుతున్నారు. పేపర్ లీకేజీ బాధ్యులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలి. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరుగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ధైర్యాన్ని కల్పించాలి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి. పేపర్ లీకేజీకి ఆస్కారం లేకుండా పటిష్ట సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి.
– ఇరుమాది పాపిరెడ్డి, పీఆర్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు, పెద్దవూర
పిల్లల జీవితాలతో చెలగాటమాడొద్దు
మూడు సంవత్సరాల నుంచి కరోనా వల్ల విద్యార్థులు చదువుపై ఆసక్తి లేకుండా ఉన్నారు. ఈ విద్యా సంవత్సరం సిలబస్ పూర్తి చేసి ఉపాధ్యాయులు మొట్టమొదటి పబ్లిక్ పరీక్షలకు సిద్ధం చేశారు. కానీ.. కొందరు రాజకీయ లబ్ధి కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడం శోచనీయం. మా ఇద్దరు పిల్లలు పరీక్షలు రద్దవుతాయేమో.. పరీక్షలు మళ్లీ రాయాలా? అని లోలోపల మదన పడుతున్నారు. మా పిల్లల భవిష్యత్తుపై మేము కూడా ఆందోళనగా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి పేపర్ లీకేజీ కారకులను అరెస్టు చేసి శాంతియుత వాతావరణంలో పరీక్షలు నిర్వహించడం ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే ఎంతటి వారినైనా వదిలి పెట్టబోమని ప్రభుత్వం తెలిపింది. పేపర్ లీకేజీకి సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలి.
– కోమారి శ్రీనివాస్, విద్యార్థిని తండ్రి, అర్వపల్లి
రాజకీయాల కోసం ఉపాధ్యాయులను బలి పశువులను చేశారు
కొందరు తమ రాజకీయాల కోసం ఉపాధ్యాయులను బలిపశువులను చేయడమే కాకుండా విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేసేందుకు తల్లిదండ్రులను క్షోభ పెట్టేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాలను చేధించిన పోలీసులు అభినందనీయులు. పదో తరగతి పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారంలో ఉపాధ్యాయులను బాధ్యులను చేయడం సరికాదు. ఎవరో ఒకరు చేసిన తప్పును మొత్తం ఉపాధ్యాయ లోకానికి ఆపాదించడం బాధ కలిగించింది. పరీక్షలు మళ్లీ నిర్వహించాలా.. వద్దా? అనే అంశం ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. విద్యార్థులు పరీక్ష హాల్లోకి వెళ్లిన తర్వాత పేపర్ లీక్ అయ్యింది. కాబట్టి పరీక్షను రద్దు చేసి మళ్లీ పెట్టాల్సిన అవసరం లేదు. దీన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం అసలే లేదు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అధికారులు, వివిధ శాఖలు సమన్వయం పాటించి పరీక్షలను విజయవంతం చేయాలి.
– కస్తూరి కిషన్‌ప్రసాద్, టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు, సూర్యాపేట
పిల్లల జీవితాలతో బండి సంజయ్ ఆడుకుంటున్నడు
కొవిడ్ సమయంలో చదువులో కొంత ఇబ్బంది పడ్డ పిల్లలు.. తేరుకొని కష్టపడి చదివారు. మొదటి రోజే పరీక్ష పేపర్ లీక్ అయ్యిందని తెలిసినప్పుడు ఆందోళన చెందాం. పరీక్షలు జరుగుతాయో.. లేదోనని భయపడ్డాం. ఇంతకుముందే ఉద్యోగస్తుల పేపర్లు లీకైన విషయం గుర్తుకొచ్చి చాలా ఆందోళనకు గురయ్యాం. కానీ.. కేసీఆర్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని పేపరు లీకేజీ వెనుక ఎవరున్నారనేది బయటపెట్టి వాళ్లని జైలుకు పంపడం సంతోషంగా ఉంది. విద్యార్థులు, నిరుద్యోగుల పైన బీజేపోళ్లు రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. ఉద్యోగ పేపర్లను లీక్ చేసిన విషయంలో కూడా బండి సంజయ్‌కు మొదటి నుంచే తెలిసి ఉంటుందని అనుమానం వస్తుంది. ఆ పేపర్లు కూడా బీజేపోళ్లు చేపించి ఉండొచ్చు. ఇటువంటి దొంగలను జైలు నుంచి బయటకు రాకుండా చూడాలి. పేపర్ లీకేజీ నిందితులైన ప్రతి ఒకరినీ వదిలి పెట్టొద్దు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న బీజేపీకి రానున్న ఎన్నికల్లో పుట్టగతులు లేకుండా చేస్తాం. ఏదేమైనా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే పిల్లలకు అన్యాయం జరుగదనే ధీమాతో ఉన్నాం. బండి సంజయ్‌ను రాష్ట్రం నుంచి బహిష్కరించాలి.
మనోైస్థెర్యం కోల్పోతున్న పిల్లలు
పదో తరగతి విద్యార్థులందరూ 15 ఏండ్ల పిల్లలే. వారికి పదో తరగతి మొదటి మెట్టు లాంటిది. పేపర్ లీక్ ఘటనతో వారు మానసిక ైస్థెర్యాన్ని కోల్పోతున్నారు. పిల్లలతోపాటు తల్లిదండ్రుల్లోనూ గందరగోళం ఏర్పడింది. దీంతోపాటు మాస్‌కాపీయింగ్ చాలా చోట్ల బయటపడుతున్నాయి. వాటిని అధికారులు ఎప్పటికప్పుడు నియంత్రించాలి. పేపర్ లీక్ చేసిన వారు దేశద్రోహులతో సమానం. ఎంతటి వారైనా పీడీ యాక్టు నమోదు చేయాలి. విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమాడొద్దు. ఎవరు తప్పు చేసినా బాధ్యతాయుతమైన వ్యక్తులుగా పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లి తప్పుచేసిన వారికి శిక్షపడే విధంగా చూడాలి. – రాజేందర్, పదో తరగతి విద్యార్థి తండ్రి, నకిరేకల్
తప్పుదోవ పట్టిస్తున్న కేంద్రం
రాజకీయ లబ్ధికోసం కేంద్ర ప్రభుత్వం యువకులను తప్పుదోవ పట్టిస్తుంది. అందుకు ఉదాహరణ లీకేజీ వ్యవహారంలో ముఖ్యులు బీజేపీకి చెందినవారు కావడం. సంవత్సరాలుగా పడిగాపులు కాసి గ్రూప్స్‌కు ప్రిపేరై పరీక్ష మంచిగా రాసి ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని ఆశలు పెట్టుకున్న వారికి పేపర్ లీకేజీ ఇబ్బందులకు గురిచేసింది. పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ ఆందోళనకు గురి చేస్తుంది. మా అన్న కుమార్తె మొదటి రోజు పరీక్ష బాగా రాశానని చెప్పింది. సాయంత్రం పేపర్ లీకేజీ వ్యవహారం తెలియడంతో చాలా బాధపడింది. ఇలాంటి వ్యవహారాలకు పాల్పడిన వారికి తగిన శిక్ష విధించాలి.
– గుండె రవి, మాండ్ర గ్రామం, నార్కట్‌పల్లి మండలం
రాజకీయ నాయకుల ఆత్యుత్సాహంతోనే గందరగోళం
పేపర్ లీకేజీలపై రాజకీయ పార్టీలు అత్యుత్సాహం ప్రదర్శించి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఉద్దేశంతో విద్యార్థుల తల్లిదండ్రులను, విద్యార్థులను మానసికంగా ఆందోళనకు గురిచేయడం సరికాదు. కుట్ర కోణం ఉన్నదని మేము భావించడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ పేపర్లు బయటికి రావడం ఆందోళనకరం. విద్యార్థులు పరీక్ష రాసి బయటికి వచ్చిన తరువాతే లీకేజీ విషయం తెలుస్తుంది.. కానీ ముందుగా తెలియదు. పేపర్ లీకేజీ వల్ల కొంత మంది విద్యార్థ్ధులు అభద్రతాభావంతో ఉన్నారు. పేపర్ లీకేజీని ఆసరాగా చేసుకుని విద్యార్థులను, తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్న రాజకీయ నాయకులను ఉపేక్షించకుండా శిక్షించాలి. అప్పుడే మరొకరు ఇలాంటి చర్యలు చేయడానికి భయపడుతారు. ఉపాధ్యాయులు రాజకీయ నాయకులకు పావులుగా మారొద్దు. ఉపాధ్యాయుడు తప్పు చేస్తే సర్వీస్ నుంచి రిమూవల్ చేసినా అభ్యంతరం లేదు. కానీ.. ఇతరులు చేసిన తప్పులకు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవద్దు. ఈ చర్యల వల్ల పేపర్ వాయిదా, రద్దు చేయడం వల్ల వచ్చే ఫలితాల్లో ఎటువంటి ప్రభావమూ ఉండదు. ఫలితాలను మాత్రం ప్రభావితం చేస్తాయనుకుంటున్నాం.
– రేపాక లింగయ్య, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు (సూర్యాపేట అర్బన్)
నిఘా వ్యవస్థను కఠినతరం చేయాలి
పరీక్ష ప్రారంభమైన తర్వాత కావాలనే కుట్రపన్ని సోషల్ మీడియాలో ప్రశ్నాపత్రం బయటకు తీసుకొచ్చి పేపర్ లీకయ్యిందని ప్రచారం చేయడం దారుణం. పరీక్షలను వాయిదా వేయడం వల్ల విద్యార్థుల్లో ఆందోళన, ఒత్తిడి పెరిగి రిజల్ట్‌పై ప్రభావం పడుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులను పట్టుకోవడంతో పరీక్ష రాసే విద్యార్థుల్లో ఆందోళన తగ్గింది. కుట్ర పన్ని పేపర్ లీకేజీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి దిగజారుడు పనులు చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకొనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. పరీక్ష కేంద్రాల చుట్టూ నిఘా వ్యవస్థను మరింత కఠినతరం చేయాలి.
– కె.కిరణ్‌కుమార్, ఉపాధ్యాయుడు, దేవరకొండ
విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు
రాజకీయ ఆధిపత్యం కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడం నాయకుడి లక్షణం కాదు. తల్లిదండ్రుల కష్టంతో పది సంవత్సరాలు చదివి మొదటిసారిగా బోర్డు పరీక్షలు రాస్తున్న విద్యార్థుల భవిష్యత్‌ను రాజకీయ చందరంగంలో పావులగా వాడుకోవడం తగదు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుకునే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– గేర నర్సింహ, టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి, నాంపల్లి
తప్పు చేసిన వారికి తగిన బుద్ధి చెప్పాల్సిందే
మా అమ్మాయి పదో తరగతి పరీక్షలు రాస్తుంది. పరీక్షలు ప్రారంభమైన రోజే తెలుగు పేపర్ లీక్ అయ్యిందని తెలియడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యా. పరీక్షలు అంటేనే తల్లిదండ్రులు, పిల్లల్లో కొంత టెన్షన్ ఉంటుంది. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో రాయాలి. అప్పుడే సరైన సమాధానాలు రాయగులుగుతారు. తొలి రోజే పేపర్ అవుటైందని తెలియడంతో టైన్షన్ మొదలైంది. మా పాప షాక్‌కు గురైంది. మళ్లీ పరీక్ష పెడుతారా? అని నిరుత్సాహానికి గురైంది. గడికోసారి పరీక్ష రద్దవుతుందా నాన్న అని అడిగితే ఏమీ కాదని నచ్చజెప్పా. రెండో రోజు పరీక్షకు వెళ్లిన గంటకే హిందీ పేపర్ వాట్సాప్‌లో చక్కర్లు అంటూ వార్త వచ్చింది. దాంతో అసలు పరీక్షలు సజావుగా సాగుతాయా.. పిల్లల పరిస్థితి ఏమిటి? అని తీవ్ర ఆందోళనకు గురయ్యా. ఇంటికొచ్చిన మా అమ్మాయి ఈ రోజు పేపర్ అవుటైందా.. మళ్లీ పరీక్ష పెడుతారా? అని ఏడుపు ముఖం పెట్టింది. దాంతో ఏం చెప్పాలో బోధపడలేదు. తెల్లారి పేపర్ లీకేజీ రాజకీయ కుట్రలో భాగమన్న సంగతి ప్రచార మాధ్యమాల ద్వారా తెలియడంతో బాధేసింది. దిగజారుతున్న రాజకీయాలకు ఇదొక నిదర్శనమనిపించింది. ప్రభుత్వం వెంటనే స్పందించి సంబంధిత అధికారులను అలర్ట్ చేయడంతో ప్రశ్నపత్రాలు వెలుపలికి రావడానికి ఒక నాయకుడు కారణమని తెలిసి బాధపడ్డా. రాజకీయ స్వార్థం కోసం పిల్లల భవిష్యత్ పణంగా పెట్టడం దుర్మార్గపు చర్య. పోలీసులు స్పందించి నిందితుడిని వెంటనే పట్టుకొని జైలుకు పండంతో పేపర్ లీకేజీలు ఆగిపోయాయి. తప్పు చేసిన వారికి తగిన బుద్ధి చెప్పాల్సిందే.
– దుండిగాల శ్రీనివాస్, 10వ తరగతి విద్యార్థిని తండ్రి, యాద్గార్పల్లి (మిర్యాలగూడ రూరల్)