– నల్లగొండలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
నల్లగొండ, జనవరి 17 : నల్లగొండ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. శనివారం ఆయన నల్లగొండ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అన్నేశ్వర గుట్ట వద్ద అమృత్-2 పథకం కింద రూ.1.45 కోట్ల వ్యయంతో నిర్మించిన 1,100 కిలో లీటర్ల తాగునీటి ట్యాంకును ప్రారంభించారు. మూడు కోట్ల 14 లక్షల 60 వేల వ్యయంతో వల్లభరావు చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. లెప్రసీ కాలనీలో రూ.3 కోట్లతో నిర్మించనున్న 33/11 కెవి సబ్ స్టేషన్కు శంకుస్థాపన చేశారు. లతీఫ్ సాబ్ గుట్ట సమీపంలో రూ.50 లక్షలతో టి ఏ టి యు ఎఫ్ ఐ డి సి నిధులతో నిర్మించిన ఎస్ ఈ-2 యూనిట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. రూ.68.83 లక్షల వ్యయంతో సుందరీకరించనున్న మోతికుంట పనులకు శంకుస్థాపన చేశారు.
నూతనంగా ప్రారంభించిన ఎస్ఈ కార్యాలయం వద్ద మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ.. సమస్యలు లేని పట్టణంగా నల్లగొండను తీర్చిదిద్దుతానన్నారు. ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో నల్లగొండ మున్సిపాలిటీని మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేస్తూ బిల్లు పాస్ చేయడం జరిగిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మేలో జరగనున్న మేయర్ ఎన్నికల్లో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కు తొలి మేయర్ రానున్నారని ఆయన వెల్లడించారు. నల్లగొండ పట్టణంలో రూ.272 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నీటి సరఫరా పథకాలను చేపట్టడం జరిగిందని, రూ.53 కోట్లతో టి యుఎఫ్ ఐడిసి ద్వారా రోడ్లు, మురికి కాలువల నిర్మాణం పనులు జరుగుతున్నాయని, మరో రూ.109 కోట్లతో సి సి రోడ్లు, రూ.9 కోట్లతో పట్టణం నలువైపులా సబ్ స్టేషన్లను చేపట్టడం జరిగిందన్నారు. అందులో భాగంగా శనివారం రెండు సబ్ స్టేషన్లు ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే రూ.900 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు పనులు చేపట్టనున్నామని, మార్చిలోపు లతీఫ్ సాబ్ గుట్ట పనులను పూర్తి చేస్తామని, బ్రహ్మంగారి గుట్ట వద్ద అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, ఎవరు ఊహించని రీతిలో నిధులను తీసుకువచ్చి నల్లగొండను అభివృద్ధి చేస్తున్నామని, భవిష్యత్లో నల్లగొండను స్మార్ట్ సిటీగా చేయాలన్నదే తన సంకల్పమని తెలిపారు. రూ.27 కోట్లతో సెంట్రల్ లైటింగ్ పనులు సైతం పూర్తి చేయడం జరిగిందన్నారు.
రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిలో భాగంగా రూ.60 వేల కోట్లతో రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, రూ.20 వేల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల ప్రణాళిక నడుస్తున్నదని, మన్ననూరు- శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ వంటి వాటిని చేపట్టడం జరిగిందని మంత్రి వెల్లడించారు. లెప్రసి కాలనీ వద్ద ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి కాంపౌండ్ వాల్ మంజూరు చేశారు. మోతికుంట అంగన్ వాడి కేంద్రాన్ని తనిఖీ చేసి భవనానికి కలర్లు, ఫ్యాన్, బొమ్మలు మంజూరు చేశారు.ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు ఇన్చార్జి కలెక్టర్, ఆర్డీఓ వై.అశోక్ రెడ్డి, ట్రాన్స్ కో చీప్ ఇంజినీర్ బాలస్వామి, నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, ప్రజారోగ్య పర్యవేక్షక ఇంజినీర్ వెంకటేశ్వర్లు, ట్రాన్స్ కో ఎస్ఈ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేశ్, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, డిసిసిబి మాజీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, పలువురు మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.