చివ్వెంల, మే 26 : జీలుగతో పంటలకు సేంద్రీయ పోషకాలు అందుతాయని సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో రైతులకు సబ్సిడీపై జీలుగ విత్తనాలు పంపిణీ చేసి మాట్లాడారు. మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్వర్యంలో వ్యవసాయ శాఖ తరపున రైతులకు పచ్చి రొట్ట పైరు విత్తనాలు, జిలుగ విత్తనాలు సబ్సిడీపై అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. మండలానికి 40 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయని, 30 కేజీల పూర్తి ధర రూ.4,275/-,ప్రభుత్వ 50% రాయితీ పోను రైతు రూ.2,137/-చెల్లిస్తే సరిపోందన్నారు. జిలుగ విత్తనాలు కావాల్సిన రైతులు తమ పరిధిలోని క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని సూచించారు.
పచ్చిరొట్ట పైర్లను ఉపయోగించడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని, ఇది భూమికి సేంద్రీయ పోషకాలను అందిస్తుందని, నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి పోషకాలను అందిస్తూ దిగుబడులను పెంచుతుందన్నారు. పచ్చిరొట్టను పొలంలో కలియ దున్నడం వల్ల భూమి సారవంతంగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ సెక్రటరీ శ్రీనివాస్, వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రియాంక, శైలజ, మానస, వెంకట్ రెడ్డి, పీఏసీఎస్ సిబ్బంది మహేందర్, రామకృష్ణ, రైతులు రమేశ్రావు, సతీశ్, వీరభద్రయ్య ఫాల్గొన్నారు.