యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : సమాజంలో గౌరవప్రదంగా జీవించేలా మనోధైర్యాన్ని కల్పించడమే మహిళా సంఘాల ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం స్వయం సహాయక సంఘాల్లో 18 ఏండ్ల నుంచి 60 ఏండ్ల వయసు వారు మాత్రమే సభ్యులుగా ఉంటున్నారు. ఆ తర్వాత వారిని గ్రూపు నుంచి తొలగిస్తున్నారు. 60 ఏండ్లు నిండినోళ్లకు బ్యాంకులు లోన్లు ఇవ్వవు. ఈ నేపథ్యంలోనే వారిని సంఘం నుంచి తొలగిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొత్తగా వీరికి అవకాశం కల్పిస్తున్నది. 60 ఏండ్లు దాటినా కూడా సంఘంలో కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ఆయా వృద్ధుల వివరాలు సేకరించాలని ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో కొత్తగా పొదుపు సంఘాల్లో మహిళలను చేర్చుకోనున్నారు.
ఫలితంగా ఉమ్మడి జిల్లాలో సుమారు 22,600 మంది సంఘాల్లో చేరనున్నారు. ఇందులో యాదాద్రి భువనగిరిలో 5,600, నల్లగొండలో 10 వేలు, సూర్యాపేట జిల్లాలో 7 వేల వరకు ఉన్నారు. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ గైడ్‌లైన్స్ ప్రకారం కొత్త గ్రూపులో కనీసం 10 మంది సభ్యులు ఉండాలి. దగ్గరలోని బ్యాంక్‌లో ఖాతాను తెరువాలి. సెల్ఫ్ హెల్ఫ్ గ్రూప్ యాప్‌లో రిజిస్టర్ చేయాలి. రెగ్యులర్‌గా సమావేశాలు నిర్వహించాలి.
సొంతంగా చిరు వ్యాపారాలకు రుణాలు..
పొదుపు సంఘాల్లో 60 ఏండ్లు నిండినోళ్లు కూడా చేరడం ద్వారా పలు రకాలు మేలు చేకూరనున్నది. ఇప్పుడున్న సంఘ సభ్యులతో పాటు వీరు కూడా అన్ని రకాల సదుపాయాలు పొందే వీలుంటుంది. దీనికి సంబంధించి తుది గైడ్‌లైన్స్ రావాల్సి ఉన్నది. ప్రస్తుతం సంఘంలో ఉన్న సభ్యులకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నారు. అంతేకాకుండా బ్యాంక్‌ల నుంచి అతి తక్కువ వడ్డీలకే రుణాలు పొందుతున్నారు. ఒక్కో వ్యక్తి రూ.లక్ష వరకు లోన్ తీసుకుంటున్నారు. ఆయా డబ్బులతో అనేక మంది సొంతంగా చిన్నచిన్న వ్యాపారాలు నడుపుకుంటూ స్వయం ఉపాధి పొందుతున్నారు.
కిరాణాదుకాణాలు, ఫ్యాన్సీ, టైలరింగ్, ప్లేట్ల తయారీ, జిరాక్స్ సెంటర్, డెయిరీ, కిచెన్ గార్డెనింగ్, క్యాండిల్ మేకింగ్, హైటెక్ వెజిటేబుల్స్, పుట్టగొడుగుల పెంపకం, ఔషధ మొక్కలు, కూరగాయల విత్తనోత్పత్తి, పండ్ల నర్సరీ నిర్వహణ తదితర వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వృద్ధులు సైతం ఇలాంటి వ్యాపారాలను ఎన్నుకునే అవకాశం. అంతే కాకుండా అవసరం ఉన్న సమయంలో సంఘం పొదుపు డబ్బులను తీసుకునే వెసులుబాటు ఉన్నది.
వివరాలుసేకరిస్తున్నం
ప్రస్తుతం 60 ఏండ్ల వరకే పొదుపు సంఘాల్లో కొనసాగే నిబంధన ఉన్నది. కానీ 60 ఏండ్లు దాటినోళ్లను కూడా చేర్చుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. దీనికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నం. దీని ద్వారా వృద్ధులకు ఎంతో ఆసరా అవుతుంది. వడ్డీలేని రుణాలు, బ్యాంక్‌ల నుంచి లోన్లు తీసుకోవచ్చు. చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు. త్వరలో పూర్తి స్థాయి మార్గదర్శకాలు రానున్నాయి.
– ఎం.ఉపేందర్‌రెడ్డి, డీఆర్డీఓ, యాదాద్రి భువనగిరి