మోత్కూరు, అక్టోబర్ 17 : మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు అధ్వానంగా మారాయి. అధికారుల పర్యవేక్షణ లేక విద్యార్థులకు సరైన భోజనం కూడా అందడం లేదు. గురువారం పట్టణంలోని ఎస్సీ బాలికలు, బీసీ బాలికలు, బాలుర సంక్షేమ హాస్టళ్లను తాసీల్దార్ రాంప్రసాద్, ఎంఈఓ గోపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం కవితాలక్ష్మీనర్సింహరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఎస్సీ బాలికల వసతి గృహంలో 100 మంది విద్యార్థినులకు గానూ ముగ్గురే ఉన్నారు. బీసీ బాలుర వసతి గృహంలో 12 మంది ఉన్నా రు. ఎక్కడా మెనూ పాటించడం లేదు. ఉన్న కొద్దిమందికి కూడా సరిపడా కూరలు చేయలేదు. బీసీ బాలుర కళాశాల హాస్టల్లో ఇద్దరే విద్యార్థులు ఉన్నారు. సంక్షేమాధికారులు అందుబాటులో లేరు. ఎస్సీ బాలికల వసతి గృహంలో ఐదుగురు వంట మనుషులకు ఆనూ ముగ్గురే విధుల్లో ఉన్నారు.
బీసీ బాలికల వసతి గృహంలో అసలు పిల్లలే లేరు. ఇన్చార్జి వా ర్డెన్ విధులకు రెగ్యులర్‌గా హాజరు కావడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. వసతి గృహాల్లో వార్డెన్లు అందుబాటులో లేకపోవడం, పిల్లలు లేకపోవడం, మెనూ పాటించకపోవడంపై జిల్లా ఉన్నతాధికారుకులకు నివేదికను అందించనున్నట్లు తాసీల్దార్ డి.రాంప్రసాద్ తెలిపారు.