ఉమ్మడి నల్లగొండ జిల్లాలో డెంగ్యూ పంజా విసురుతున్నది. వర్షాకాలంలో అవడం, పారిశుధ్య నిర్వహణ లోపించడంతో కేసులు విజృంభిస్తున్నాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా రోజురోజుకు పెరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు 240 కేసులు నమోదయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రులకు వస్తున్న కేసులు ఇందుకు అదనం.
వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ముఖ్యం గా డెంగ్యూ, మలేరియా, టైపాయిడ్, చికెన్‌గున్యా, పైలేరియా వంటి వ్యాధులు చుట్టుముడుతున్నాయి. వైరల్ ఫీవర్లు పెద్దఎత్తున నమోదవుతున్నాయి. తాజాగా మలేరియా, డెంగ్యూ కేసులు పెరిగాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లా కేంద్ర ఆస్పత్రితోపాటు రామన్నపేట, ఆలేరు, చౌటుప్పల్ ఏరియా ఆస్పత్రులు, 21 పీహెచ్‌సీలు ఉన్నాయి. అన్ని చోట్లకూ రోగులు క్యూ కడుతున్నారు. జ్వరం, దగ్గు, వాంతులు, విరేచనాల సమస్యతో ఉదయం నుంచే తరలివస్తున్నారు. జిల్లా దవాఖానలో రోజూ 200 నుంచి 250 ఓపీ నమోదవుతున్నది.
ఉమ్మడి జిల్లాలో ఇలా..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 240 డెంగీ కేసులు నమోదు కాగా, యాదాద్రి భువనగిరిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 14 కేసులు రికార్డ్ అయ్యాయి. యాదగిరిగిగుట్ట, పోచంపల్లి మండలాల్లో రెండు కేసులు తేలాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో మరిన్ని కేసులు నమోదైనట్లు తెలుస్తున్నది. ఎయిమ్స్‌లోనూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ దగ్గరలో ఉండడంతో అనేకమంది నగర శివారులోని దవాఖానలకు వెళ్తున్నారు. గతేడాది జిల్లాలో 26 డెంగీ కేసులు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లాలో 166 డెంగ్యూ కేసులు వచ్చినట్లు నిర్ధారించారు. నల్లగొండలో 60 కేసులు రికార్డ్ అయ్యాయి.
పల్లెల్లో జ్వర సర్వేలు..
సీజనల్ వ్యాధుల నేపథ్యంలో అధికార యంత్రాంగం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటుచేసింది. ఈ బృందంలో జిల్లా మలేరియా నియంత్రణ అధికారి, మలేరియా నియంత్రణ సహాయ అధికారి, ముగ్గురు సబ్ యూనిట్ ఆఫీసర్లు ఉన్నారు. వీరు ఎప్పటికప్పుడు సీజనల్ వ్యాధులపై అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం కేసులు నమోదైన చోట జ్వర సర్వేలు నిర్వహిస్తున్నారు. కేసుల వచ్చిన చోట్ల చుట్టుపక్కల ఇండ్లను కూడా పూర్తిగా పరీక్షిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 13వేల ఇండ్లలో జర్వ సర్వే చేశారు.
పారిశుద్ధ్యం అస్తవ్యస్తం..
కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. ప్రస్తుతం ప్రజాప్రతినిధులు లేకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది. వారంతా వారి శాఖలకు సంబంధించిన రోజువారీ విధులను నిర్వహిస్తూనే ఆయా మండలాలు, గ్రామాల బాధ్యతలను అదనంగా చూస్తున్నారు. దాంతో పారిశుద్ధ్యంపై సరైన ఫోకస్ పెట్టడం లేదని తెలుస్తున్నది. ఫలితంగా గ్రామాలు, పట్టణాల్లో చెత్తచెదారం పేరుకుపోతున్నది. డ్రైనేజీలు పేరుకుపోతున్నాయి. పందులు, వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు కూడా కనిపించడం లేదు. ఫాగింగ్ మొక్కుబడిగా చేస్తున్నారు.
ప్రైవేట్ దవాఖానల్లో దోపిడీ..
సీజనల్ వ్యాధులను ఆసరా చేసుకుని ప్రైవేట్ హాస్పిటళ్లు, ల్యాబ్‌లు రోగులను అందినకాడికి దోచుకుంటున్నాయి. అవసరం లేకున్నా అడ్డగోలుగా పరీక్షలు చేస్తున్నాయి. ల్యాబ్‌ల్లో రిపోర్టులు కూడా సరిగ్గా రావడం లేదని రోగులు వాపోతున్నారు. ప్లేట్లెట్లు తక్కువగా ఉన్నా డెంగ్యూ అంటూ భయపెడుతున్నారని చెప్తున్నారు. చాలావరకు ల్యాబ్‌ల్లో ఎలీసా టెస్టులు చేయకుండానే డెంగ్యూ అని నిర్ధారిస్తున్నారు. మరోవైపు వైద్యాధికారుల పర్యవేక్షణ కూడా ఉండడం లేదు.
జనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
అనుమానం వస్తే పరీక్షలు చేయించుకోవాలి
వైరల్ ఫీవర్లు అన్నీ డెంగ్యూ కాదు. భయపడాల్సిన అవసరం లేదు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. దోమతెరలు వాడాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు వెంటనే పరీక్షలు చేస్తున్నాం. తద్వారా రోగి త్వరగా కోలుకునేందుకు ఆస్కారం ఉంటుంది. డెంగ్యూ లక్షణాలు, అనుమానం ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లో ఆలస్యం చేయొద్దు.
– డాక్టర్ అర్జున్ రాజ్, మైక్రోబయాలజిస్ట్