కొండమల్లేపల్లి, జూన్ 23 : దేవుడు వరమిచ్చినా పూజారి కరునించడాయే అన్నచందంగా ఉంది కొండమల్లేపల్లి మండలంలోని కేజీబీవీ బాలికల పరిస్థితి. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద విద్యార్థులకు విద్య అందించాలని ఉద్దేశంతో ప్రారంభించిన కేజీబీవీ పాఠశాలలు నేడు దయనీయ స్థితిలో కొనసాగుతున్నాయి. నూతన మండలంగా ఏర్పడిన కొండమల్లేపల్లికి కేజీబీవీ పాఠశాల మంజూరు కాగా అద్దె భవనంలో ఏర్పాటు చేశారు. కేసీఆర్ సర్కారు కేజీబీవీ పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించడానికి నిధులు కేటాయించింది. దాంతో మండలంలోని కోల్ముంతల్ పహాడ్ గ్రామ పంచాయతీలో భవనం నిర్మాణానికి 2021లో అప్పటి జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. దీని కోసం రూ.3.35 కోట్లు కేటాయించారు. మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు నిర్మాణ పనులు పూర్తి కాలేదు.
కొండమల్లేపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఏర్పాటు చేసి అంగ్ల మాధ్యమం అందుబాటులోకి తీసుకొచ్చింది. దాంతో ఈ పాఠశాలలో అడ్మిషన్ల సంఖ్య భారీగా పెరిగింది. ఆరు నుంచి పదో తరగతి వరకు ఈ పాఠశాలలో విద్యార్థులు చదువుతున్నారు. ప్రస్తుతం ఇందులో 240 మంది విద్యార్థినులు ఉన్నారు. రేకుల షెడ్డుతో ఇబ్బందులు పడుతున్నారు. సరిపడా గదులు, టాయిలెట్స్ సరిగా లేవు. ఉపాధ్యాయులు చెట్లకింద కూర్చోపెట్టి బోధిస్తున్నారు. దీనికి తోడు అద్దె భవనం ప్రహారీ గోడ చిన్నదిగా ఉండడంతో ఆకతాయిల అగడాలు మితిమిరి పోయాయి. గత సంవత్సరం పాఠశాల రేకుల షెడ్డుకు షార్ట్ సర్యూట్ రావడంతో మూడు నెలలపాటు దేవరకొండలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో తరగతులు నిర్వహించారు. ఇలాంటి పరిస్థితుల్లో పక్కా భననం నిర్మాణం తప్పనిసరి. కానీ అధికారులు పట్టించుకోకపోవడం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయి.
కస్తూర్బా గాంధీ పాఠశాల బిల్డింగ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలి. పట్టణంలో అద్దె భవనంలో మౌలిక వసతులు లేక బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యాశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం తగదు. ఈ విద్యా సంవత్సరానికి కేజీబీవీ పాఠశాల నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి.
-రమావత్ లక్ష్మణ్ నాయక్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు