నీలగిరి, ఆగస్టు 28 : నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రతీక్‌రెడ్డి జూనియర్ కళాశాల సమీపంలోని అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద బుధవారం అర్ధరాత్రి యువకుడు హత్యకు గురయ్యాడు. క్యాంటీన్ వద్ద రక్తపు మడుగులో విగత జీవిగా ఉన్న యువకుడిని గురువారం తెల్లవారుజామున వాకింగ్‌కు వచ్చిన కొంతమంది గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వన్‌టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి డాగ్ స్వాడ్, క్లూస్ టీంలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలోనే క్లూస్ టీమ్ కొన్ని ఆధారాలు, వేలిముద్రలు తీసుకోగా డాగ్ స్కాడ్ మా త్రం మునుగోడు రోడ్డులో సుమారు ఐదు కిలోమీటర్ల వరకు వెళ్లి వెనక్కివచ్చింది. మృతుడు నాంపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన చింతకింది రమేశ్(40)గా పోలీసులు గుర్తించారు. రమేశ్ నల్లగొండలో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. 15ఏండ్ల క్రితం నల్లగొండకు వచ్చి బీటీఎస్ ప్రాంతంలో అద్దె ఇంట్లో భార్యాపిల్లలతో ఉంటున్నాడు. పని ఉన్నప్పుడు వెళ్లి, లేనప్పుడు ఖాళీగా ఉంటూ తాగుతుండడంతో భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తి భార్య పుట్టింటికి వెళ్లినట్లు సమాచారం.
దీంతో నెల కితం మర్రిగూడ పోలీస్ స్టేషన్లో ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు బంధువులు పేర్కొన్నారు. దీంతో రమేశ్ నల్లగొండకు వచ్చి భాస్కర్ టాకీస్ ఆడ్డ వద్ద పనికి వెళ్తూ అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద తింటూ రాత్రి సమయంలో అక్కడే పడుకునే వాడని బంధువులు తెలిపారు. పాష అనే వ్యక్తి ఫోన్ నుంచి బుధవారం రాత్రి భార్య రేణుకకు, బంధువులు మైనం జానయ్య, బుషీపాక నగేశ్‌లకు ఫొన్ చేసి డబ్బులు అడిగినట్లు బంధువులు వివరించారు. స్నేహితులే తాగిన మైకంలో ఇక్కడే చంపారా, లేక ఇతర ప్రాంతంలో చంపి మృతదేహాన్ని ఇక్కడకు తీసుకువచ్చి పడేశారా అనే కోణంలో సీసీ కెమెరాల ఆధారం గా విచారణ చేస్తున్నారు. కుటుంబ కలహాల కారణంతో రమేశ్‌ను మర్డర్ చేసి ఉంటారా ఇంకా ఏదైనా కారణాలతో హత్య చేశారా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. దీంతో పోలీసులు అతడి స్నేహితులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం. మృతుడి బావ (అక్క భర్త) బుషీపాక వెంకటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.