– రెండోసారి నేరం చేస్తే పీడీ యాక్ట్
– సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
– అన్ని మతాల పండుగలను పరస్పర గౌరవంతో జరుపుకోవాలి
కోదాడ, ఆగస్టు 29 : కోదాడ సబ్ డివిజన్ వ్యాప్తంగా ఉన్న రౌడీ షీటర్లు, గంజాయి సేవించేవారు, అమ్మకం, రవాణాదారులు, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే ప్రతి ఒక్కరు తమ పాత అలవాట్లను మానుకుని సత్ప్రవర్తనతో ఆదర్శంగా జీవించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ హితవు పలికారు. శుక్రవారం కోదాడ పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో కోదాడ సబ్ డివిజన్ వ్యాప్తంగా ఉన్న రౌడీ షీటర్లు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువతకు నిర్వహించిన కౌన్సిలింగ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తాత్కాలిక సుఖం కోసం చెడు అలవాట్లకు లోనై కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతూ తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. తెలిసి తెలియక చేసిన తప్పులను సరిదిద్దేందుకు తామిచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రెండోసారి నేరం చేస్తే అనివార్యంగా పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. సమాజ శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. మాదకద్రవ్యాలకు అలవాటై భార్యా పిల్లలను వదిలేస్తే వారి బతుకులు ఎలా ఉంటాయో అవగతం చేసుకుని మంచి పౌరులుగా మారాలని ఉదాహరణలతో వివరించారు. ఇటీవల సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, ఆధార్ కార్డు నంబర్ గాని బ్యాంక్ ఎకౌంట్ నంబర్ గాని ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ చెప్పవద్దన్నారు. తెల్లారేకల్లా లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చని ఆన్లైన్లో వ్యాపారం చేసి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలను ఆయన వివరిస్తూ వాటికి దూరంగా ఉండాలన్నారు. లక్కీ డ్రా అలాంటి మోసాలపై అప్రమత్తగా ఉండాలన్నారు.
ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీసేనని, అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే ఆ సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలన్నారు. వినాయక చవితి, దసరా, దీపావళితో పాటు పాటు అన్ని మతాలకు చెందిన పండుగలను వివాదాలకు తావు లేకుండా పరస్పర గౌరవంతో జరుపుకోవాలని సూచించారు. అవగాహన సదస్సుకు అధ్యక్షత వహించిన కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి భవిష్యత్లో నేరాలు చేయమని, మంచి ప్రవర్తన కలిగి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సీఐలు చరమందరాజు, ప్రతాప లింగం, శివ శంకర్ నాయక్, ఎస్ఐలు పాల్గొన్నారు.