రామగిరి, జూన్ 8 : మృగశిర కార్తె ప్రవేశం సందర్భంగా శనివారం మార్కెట్లో మాంసపు ప్రియులతో సందడి నెలకొంది. ఈ రోజు చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని, అస్తమా వ్యాధి రాదనే నమ్మకంతో జనం ఎక్కువగా చేపలు కొనుగోలు చేశారు. దాంతో నల్లగొండ పట్టణంలోని పానగల్ రోడ్డు, ప్రకాశంబజార్ చేపల మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. పలు గ్రామాల్లోని చెరువుల వద్ద చేపల కోసం బారులుదీరారు. అయితే.. ఈ సారి చేపల ఉత్పత్తి తక్కువగా ఉండడంతో విక్రయదారులు ఎక్కువ ధరకు అమ్మకాలు చేపట్టారు. దీంతోపాటు చికెన్, మటన్ సెంటర్లు కూడా కోలాహలంగా కనిపించాయి.