యాదాద్రి భువనగిరి, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : మరికొన్ని రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానుండగా.. ఇప్పటి వరకు ప్రభు త్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్ ఊసేలేదు. అసలు ఈ సంవత్సరం ఇంత వరకూ క్లాత్ సరఫరా కాలేదు. దీంతో ఈ ఏడాది యూనిఫామ్ పంపిణీపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు తమకు ప్రభు త్వం నుంచి ఎలాంటి సమాచారం లేదని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ఉపాధి లేక మహిళా సంఘాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి. మరోవైపు ఈ విద్యా సంవత్సరం నుంచే పంపిణీ చేస్తామన్న 21 వస్తువుల స్పెషల్ కిట్‌పై కూడా స్పష్టత లేకపోవడంతో గందరగోళం నెలకొంది.
మహిళా సంఘాలు ఎదురుచూపు..
ప్రభుత్వ పాఠశాలు, హాస్టళ్లలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న యూ నిఫామ్ కుట్టించే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించారు. సాధారణంగా టెస్కో ద్వారా వచ్చిన క్లాత్‌ను డీఈవో డీఆర్డీవోకు అప్పగిస్తారు. స్వయం సహాయక సంఘాల్లో పనిచేస్తున్న మహిళలు యూనిఫామ్ కుట్టి ఇస్తారు. ఒక్కో డ్రెస్సుకు రూ. 75 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. కానీ ఈ ఏడాది ఇంకా క్లాత్ రాకపోవడంతో తమకు ఎప్పుడు పని కల్పిస్తారోనని మహిళా సంఘాల సభ్యులు ఆశగా ఎదురు చూస్తున్నారు. క్లాత్ రాకపోవడంతో వారికి ఉపాధి లేకుండా పోయింది.
స్పెషల్ కిట్ ఏదీ..?
సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు ప్రభు త్వం 21 రకాల వస్తువులతో కూడిన స్పెషల్ స్కూల్, హాస్టల్ కిట్ ఇవ్వాలని నిర్ణయించింది. చదువుకు కావల్సిన సామగ్రి కోసం విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ కిట్ అందించాలని ప్రభుత్వం భావించింది. కిట్‌లో షూస్, సాక్స్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, టై, బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్, షార్ప్‌నర్, జామెట్రీ బాక్స్, డిక్షనరీ తదితర వస్తువులు ఉంటాయి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలతోపాటు జనరల్ గురుకులాలు, కేజీబీవీల్లో ఉండే విద్యార్థులకు కిట్‌లో అదనంగా దుప్పట్లు, స్పోర్ట్స్ డ్రెస్సు, పీటీ డ్రెస్సు, బ్లేజర్ లాంటి ఇవ్వాలని అనుకున్నారు. ఇది ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గతంలోనే ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే కిట్‌పై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది.
సరఫరా కాని క్లాత్
ప్రతియేటా విద్యాసంవత్సరం ప్రారంభంలోనే సర్కార్ బడుల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోటు బుక్కులతోపాటు యూనిఫామ్ అందజేస్తారు. పాఠశాల ప్రారంభమైన రోజు మొదటి జత.. ఆ తర్వాత మరో జత నెలాఖరులో పంపిణీ చేస్తారు. ఏటా మార్చి, ఏప్రిల్ నెలల్లోనే విద్యార్థులకు దుస్తులు కుట్టించేందుకు బల్క్‌గా క్లాత్ కొనుగోలు చేసి జిల్లాలకు సరఫరా చేస్తారు. గతేడాది ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు బాలికలకు ఫ్రాక్, 4,5 తరగతుల వారికి స్కర్ట్, ఆరు నుంచి 10వ తరగతి వరకు బాలికలకు పంజాబీ డ్రెస్సు, పైన కోటు, బాలురకు ప్యాంట్, షర్టులు అందజేశారు.
కానీ ఈ ఏడాది మాత్రం యూనిఫామ్ మోడళ్లపై స్పష్టత రాలేదు. లెక్క ప్రకారం జిల్లాలో 672 పాఠశాలల్లో 45,296 మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున డ్రెస్సులు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. అసలు క్లాత్ ఎప్పుడు వస్తుంది..? కొలతలు ఎప్పుడు తీసుకుంటారు..? కుట్టు పని ప్రారంభించేది ఎన్నడు..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక గత్యంతరం లేక నూతన విద్యా సంవత్సరంలోనూ పాత దుస్తులే వేసుకొని పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.