హైదరాబాద్, జూలై 30 (నమస్తేతెలంగాణ): కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలోనే పూర్తిస్థాయిలో నిర్వహించాలని, ఆ ఫ్యాక్టరీలో 90 శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలను స్థానికులకే కేటాయించాలని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాసర్ కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు గురువారం ఒక లేఖ రాశారు. గురువారం ఆయన నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ పలు అంశాలను వివరించారు.
తెలంగాణలోని వరంగల్-కాజీపేట ప్రాంత అభివృద్ధి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, ప్రయాణికుల సౌకర్యాలు, రైల్వే మౌలిక వసతులు కల్పించాలని ఆయన తన లేఖలో మంత్రిని కోరారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలుచేస్తూ, కాజీపేట-వరంగల్ ప్రాంత అభివృద్ధికి సముచిత ప్రాధాన్యం కల్పించాలని విజ్ఞప్తిచేశారు.
ఫ్యాక్టరీని ప్రైవేటీకరించొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విభజన చట్టానికి లోబడి కాజీపేటను ప్రధాన కార్యాలయంగా చేసుకొని ప్రత్యేక రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. కాజీపేటలో ప్రస్తుతం ఉన్న క్రూలింక్‌లను ఇతర ప్రాంతాలకు తరలించొద్దని కోరారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యార్థం కాజీపేట సమీపంలోని బోడగుట్ట వద్ద తక్షణమే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని కోరారు.
దేశంలోని ప్రధాన నగరాలను కలుపుతూ కాజీపేట నుంచి కొత్త రైల్వే సర్వీసులను ప్రారంభించాలని, రాబోయే రైల్వేబడ్జెట్‌లో తెలంగాణకు ఎకువ నిధులు కేటాయించి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని లేఖలో రైల్వే మంత్రిని కోరినట్టు వినయ్ భాసర్ తెలిపారు. వరంగల్ లేదా కాజీపేటలో సెంట్రలైజ్డ్ క్రూ లాబీని ఏర్పాటు చేయాలని, రైల్వేస్టేషన్లప ఆధారపడి జీవనం సాగించే చిన్న వ్యాపారులు, హ్యాకర్ల కోసం ప్రత్యేక వెండింగ్ జోన్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
స్థానిక పారిశ్రామిక శిక్షణ సంస్థల (ఐటీఐ) విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్ అవకాశాలు కల్పించాలని, వరంగల్‌లోని రైల్వే స్టేడియాన్ని ఆధునిక మౌలిక సదుపాయాలతో అప్‌గ్రేడ్ చేయాలని, రైల్వే స్టేషన్ల ఎదురుగా ఉన్న ఆటో-రిక్షా స్టాండ్ల వద్ద ఎలాంటి యూజర్ చార్జీలు, ఫీజులు వసూలు చేయకూడదని కోరారు. వరంగల్ ప్రజల చిరకాల డిమాండ్ అయిన ఫాతిమా బ్రిడ్జ్ పూర్తికి రైల్వేశాఖ పూర్తి చొరవ చూపాలని డిమాండ్ చేశారు.