మిర్యాలగూడ, మే 12 : రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతిచెందాడు. ఈ దుర్ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని తుంగపాడు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్ఐ లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురారం మండలం కంపాలపల్లి గ్రామానికి చెందిన నాగెల్లి రాములు (80) అనే వృద్దుడు చెన్నాయిపాలెం గ్రామంలోని తన మనుమరాలి ఇంటికి వెళ్లడం కోసం మిర్యాలగూడ మండలంలోని తుంగపాడు గ్రామంలో ఆటో దిగి రోడ్డు దాటుతున్నాడు.
అదే సమయంలో హాలియా వైపు నుంచి మిర్యాలగూడ వైపునకు వస్తున్న లారీ రాములును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాములు తల, కాళ్లు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో వృద్ధుడు మృతిచెందాడు. మృతుడి కుమారుడు నాగెల్లి శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.