చందంపేట(దేవరకొండ), డిసెంబర్ 16 : దేవరకొండ డివిజన్ పరిధిలోని 9 మండలాల్లో బుధవారం నిర్వహించే పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సామగ్రితో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి తరలి వెళ్లిన సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. అలాగే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు అదనపు బలగాలు చేరుకున్నాయి. కాగా పోలింగ్ ఏర్పాట్లను మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలించారు.
దేవరకొండ డివిజన్ పరిధిలోని దేవరకొండ, చందంపేట, నేరెడుగొమ్ము, గుండ్లపల్లి(డిండి), చింతపల్లి, కొండమల్లేపల్లి, పెద్దఅడిశర్లపల్లి, గుడిపల్లి, గుర్రంపోడు మండలాల్లోని 227 పంచాయతీలు, 1603 వార్డులకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం 2,206 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాగా 2,60,316 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
డివిజన్ పరిధిలోని 9 మండలాలకు పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను ఆయా మండలాల వారీగా అధికారులు మంగళవారం పూర్తి చేశారు. దేవరకొండ మండలానికి సంబంధించి దేవరకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ సామగ్రిని ఎన్నికల అధికారులు, సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించారు.
మూడో దశ పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. మంగళవారం దేవరకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేసి, ఏర్పాట్లను పరిశీలించారు. 50 మంది జోనల్ అధికారులతో పాటు 75 మంది రూట్ ఆఫీసర్లను నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. వాలంటీర్లు దివ్యాంగులను ఓటరు కేంద్రాలకు వీల్ చైర్‌పై తీసుకురావాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియలో లోపాలు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు.
పోలింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘాతో పాటు అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ తెలిపారు. పోలింగ్ సజావుగా జరిగేలా రాజకీయ పార్టీలు, ఓటర్లు సహకరించాలని కోరారు. పోలింగ్ ప్రక్రియకు విఘాతం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారి వెంట దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్, ఎంపీడీవోలు డేనియల్, లక్ష్మి, సన్నీ జాకబ్, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.