– నల్లగొండ జిల్లా సంక్షేమ అధికారి కె.వి.కృష్ణవేణి
నీలగిరి, ఏప్రిల్ 18 : అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే 6 నెలల నుండి 2 సంవత్సరాలలోపు చిన్నారుల వయస్సుకు తగినట్లుగా వారిలో వచ్చే మార్పులను గమనిస్తూ ఉండాలని నల్లగొండ జిల్లా సంక్షేమ అధికారి కె.వి.కృష్ణవేణి అన్నారు. శనివారం 8వ పోషణ పక్వాడ కార్యక్రమాన్ని శేర్బంగ్లా సెక్టార్ వారిగా హౌజింగ్‌బోర్డు కాలనీ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారుల్లో మాట, కదలికలు, స్పందన వారి వయస్సు ప్రకారం గమనిస్తూ అభివృద్ధి చేయాలని సూచించారు. ఆరు నెలల వయసులో చిన్నారులు చిరునవ్వుతో తిరగడం, సంవత్సరంలోపు పిల్లలు నడవడానికి ప్రయత్నం చేయడం, రెండు సంవత్సరాలలో వాళ్లు చిన్న చిన్న మాటలు మాట్లాడటం వంటివి ఎప్పటికప్పుడు గమనిస్తుండాలన్నారు. ఈ లక్షణాలు లేకపోతే వెంటనే తల్లిదండ్రులకు తెలియజేసి ఆ దిశగా ప్రయత్నాలు చేయాలన్నారు.
తల్లిదండ్రులకు పిల్లలతో ఎక్కువగా మాట్లాడడం, ఆటలు ఆడించడం, ప్రేమగా చూసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. టీవీ, మొబైల్ ఎక్కువగా చూపించకుండా ఆటలు వాడేలా అక్షరాలు గుర్తుపట్టేలా వారికి నేర్పించేలా చూడాలన్నారు. చిన్నారుల అభివృద్ధికి సరైన పోషకాహారం కీలకమని తెలిపారు. ఈ నెల 9 నుంచి 23 వరకు జరిగే ఈ కార్యక్రమంలో తల్లి- శిశు పోషణ, ఆరోగ్య అవగాహనపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ డ సీడీపీఓ తూముల నిర్మల, సూపర్వైజర్ మల్లేశ్వరి, అంగన్వాడీ టీచర్లు మందడి సరిత, బత్తుల మల్లికాంబ, కౌసర్, అజీమా, జ్యోతి, యాదమ్మ, నాగమణి, ప్రమీలా, విజయలక్ష్మి, సునీత, సరస్వతి, జ్యోతి, పద్మ, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.