కట్టంగూర్, జూన్ 06 : బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు అన్నారు. ప్రొపెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని శుక్రవారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించి మాట్లాడారు. పాఠశాలల్లో వసతులు కల్పించడంతో పాటు మధ్యాహ్న భోజనం, యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విశాలమైన గదులు, ఆటస్థలాలు, సైన్స్ ల్యాబ్, గ్రంథాలయ సౌకర్యాలతో పాటు డిజిటల్ తరగతుల ద్వారా ఆధునిక పద్ధతులతో విధ్యా భోదన చేస్తున్నట్లు చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎంఈఓ అంబటి అంజయ్య, ఇన్చార్జి ఎంపీఓ చింతమల్ల చలపతి, ఏపీఎం సైదులు, పంచాయతీ కార్యదర్శి వడ్లకొండ అశోక్ గౌడ్, ఉపాధ్యాయులు, అంథోని, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.