సూర్యాపేట, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : పుట్టబోయే శిశువు పూర్తి ఆరోగ్యంగా ఉండాలంటే గర్భిణుల్లో రక్తహీనత, పోషకాహార లోపం ఉండొద్దనే ఉద్దేశంతో కేసీఆర్ సర్కారు హయాంలో అందించిన న్యూట్రిషన్ కిట్లకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రహణం పట్టింది. నాలుగు నెలలుగా గర్భిణులకు ఇవ్వాల్సిన సుమారు ఆరు వేల కిట్లు అందలేదు.
గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవించే వరకు ఐదు, తొమ్మిదో నెలల్లో మొత్తం రెండు సార్లు రూ.2వేల విలువ చేసే పోషకాహారాలతో కూడిన కిట్లను గత ప్రభుత్వం అందించింది. ఇవి గత ఫిబ్రవరి వరకు సజావుగా ప్రస్తుతం వాటి ఊసే లేకుండా పోయింది. ఇక గర్భిణులు, పుట్టిన శిశువులకు గతంలో ఇచ్చిన కేసీఆర్ కిట్లను ఎంసీహెచ్ కిట్లుగా పేరు మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని కూడా నిలిపివేయడం పట్ల మహిళలు గుర్రుగా ఉన్నారు.
ఆరు గ్యారెంటీలు, అనేక అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసింది. కొత్త హామీల అమలు అలా ఉంచితే గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలను కూడా అమలు చేయడం లేదు. ప్రధానంగా పుట్టబోయే శిశువులు పూర్తి ఆరోగ్యంగా, బలవర్థకంగా ఉండాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన న్యూట్రిషన్ కిట్ల పంపిణీ ఆగిపోయింది.
గర్భిణులు పౌష్టికాహారం తీసుకుంటేనే శిశువులు ఆరోగ్యకరంగా పెరుగుతారని ఆలోచన చేసి గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవించే వరకు రెండు సార్లు రూ.2 వేల వ్యయంతో న్యూట్రిషన్ కిట్లు అందించింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలతో కూడిన కిట్లను ఐదు, తొమ్మిదో నెలలో ఇచ్చింది. కిట్లలో రెండు కిలోల న్యూట్రిషన్ మిక్స్డ్ పౌడర్, కిలో ఖర్జూర, 500 గ్రాముల నెయ్యి, ఐరన్ సిరప్ 3 బాటిళ్లు, ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లు, ఒక కప్పు ఇతర వస్తువులు ఉండేవి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం నవంబర్ 2023లో సరఫరా చేసిన న్యూట్రిషన్ కిట్లు సుమారు జనవరి వరకు వచ్చాయి. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా జనవరి నుంచి మే వరకు 4,980 మంది ప్రసవాలు జరిగాయి. ఐదు నెలల కాలంలో కొంత మంది గర్భిణులకు ఒకటి, మిగిలిన వారికి వారికి రెండు సార్లు చొప్పున న్యూట్రిషన్ కిట్లు అందాల్సి ఉంది. ఈ లెక్కన ఐదు నెలల్లో దాదాపు 8,950 కిట్లు అందాల్సి ఉండగా సరఫరా నిలిచిపోయింది.
వీటితోపాటు ప్రసవం తర్వాత తల్లీబిడ్డలకు అవసరమైన 13వేల రూపాయల విలువ చేసే కేసీఆర్ కిట్లను రేవంత్ సర్కార్ పేరు మార్చి ఎంసీహెచ్ కిట్‌గా నామకరణం చేసినప్పటికీ కొత్తగా ఒక్క కిట్ కూడా పంపిణీ చేయలేదు. న్యూట్రిషన్ కిట్ల మాదిరి ఎంసీహెచ్ కిట్లను కూడా గతేడాది నవంబర్‌లో వచ్చిన వాటిని ఫిబ్రవరి వరకు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. గర్భిణులు, బాలింతలు, శిశువు సంక్షేమం కోసం చేపట్టిన న్యూట్రిషన్, కేసీఆర్ కిట్లను నిలిపివేయడం పట్ల మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.