యాదాద్రి భువనగిరి, మార్చి 16 (నమస్తే తెలంగాణ) ; అన్నదాత బతుకు ఆగమైతున్నది. అన్నం పెట్టే రైతు జీవితం ప్రశ్నార్థకమైతున్నది. ఆరుగాలం కష్టించి పండించిన పంటను కాపాడుకునేందుకు అప్పులపాలై బతుకు బక్కచిక్కిపోతున్నది. ఓ వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం.. మరో వైపు కలిసిరాని కాలంతో అన్నదాత అంతిమంగా తనువు చాలిస్తున్నాడు. దిక్కుతోచని స్థితిలో వ్యవసాయ బావుల వద్దే పురుగుల మందు తాగి.. కాటికి కాలు చాపుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
40మందికి పైగా తనువు చాలించి..
పదేండ్ల పాటు సంతోషంగా బతికిన రైతులు బక్కచిక్కిపోతున్నారు. వ్యవసాయం సంక్షోభంలో పడి దుఃఖసాగరంలో మునిగి తేలుతున్నారు. మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు దాపురించాయి. పల్లెల్లో నాటి కష్టాలు కండ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ 15నెలల కాలంలో ఉమ్మడి నల్లగొండలో సుమారు 40 మందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇందులో అత్యధికంగా అప్పుల బాధ తాళలేక ప్రాణాలు తీసుకున్నారు. ఇటీవల కాలంలో రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.
సర్కార్ నిర్లక్ష్యమే శాపం..
అన్నదాత ఆత్మహత్యలకు సర్కార్ నిర్లక్ష్యమే శాపంగా మారిందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో సుభిక్షంగా ఉన్న కర్షకులకు కాంగ్రెస్ వచ్చాకే కష్టాలు వచ్చాయని పేర్కొంటున్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో ఏనాడూ ఇబ్బంది లేకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కానీ ఏడాదిన్నరలోనే రైతులు ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొంటూ అరిగోస పడుతున్నారు. గత యాసంగిలో రైతు భరోసా ఎగవేత, అరకొరగా రుణమాఫీ, చెరువులను నింపకపోవడం, గతంలో మాదిరి కాళేశ్వరం జలాలు అందించకపోవడం, నాగార్జున సాగర్ ఆయకట్టులో పూర్థి స్థాయిలో నీటి విడుదల లేకపోవడం, లో ఓల్టేజ్ కరెంట్ కష్టాలు, ధాన్యం కొనుగోళ్లలో విఫలం, ఎండిపోతున్న పొలాలు, కరువు ఛాయలు తదితర అనేక కారణాలతో రైతులు ఆగమయ్యే పరిస్థితి వచ్చింది. ప్రస్తుత సీజన్లో దిగుబడి సమయం వచ్చినా పెట్టుబడి డబ్బులు ఇంకా జమ చేయలేదు. దీంతో అనేక మంది ప్రైవేట్‌లో వడ్డీలకు తెచ్చి సాగు చేశారు.
ఆఖరికి మిగులుతున్నది అప్పులు.. నష్టాలే..
పంట చేతికొచ్చేందుకు అన్నదాత ఎన్ని కష్టాలు పడుతున్నా ఆఖరికి అప్పులు, నష్టాలే మిగులుతున్నాయి. కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంది. సుమారుగా ఒక్కో ఎకరానికి రూ. 26 వేల వరకు పెట్టుబడి పెట్టారు. ఇందులో దున్నకాలు, నాట్లు, ఫర్టిలైజర్, విత్తనాలు, మందులు, కూళ్లు, ఇతర పనులకు ఖర్చు చేశారు. ఇక ఒక్కో ఎకరానికి సుమారుగా 28 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుంది. ఒక్కో క్వింటాల్ రూ. 2వేలు అనుకున్నా రూ. 56 వేలు అవుతుంది. అంటే ఎకరం భూమి సరిగ్గా పంట దిగుబడి వస్తే పెట్టుబడి పోగా రూ. 33వేలు లాభం వస్తుంది. ఇప్పుడు పంటలు ఎండిపోతుండటంతో ఎకరానికి రూ.30 వేల దాకా నష్టం వాటిల్లినట్లు తెలుస్తున్నది. ఇటు నష్టాలు, అటు అప్పులతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.
ఈ ఫొటోలోని రైతు పేరు మోటె నరసింహ (50). రామన్నపేట మండలంలోని సిరిపురం. నరసింహ గ్రామంలోనే పది ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. దీనికోసం అప్పు చేశాడు. పొలం ఎండిపోతుండటంతో ఈ నెల 10న మనస్థాపంతో వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామానికి చెందిన అంతటి జగన్(45) బోర్ వెల్స్‌లో, వ్యవసాయంలో అప్పులపాలై కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో మనస్థాపం చెంది.. తన వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన ఈ నెల 12న చోటుచేసుకుంది.
ఈ చిత్రంలో ఉన్న అన్నదాతది తుర్కపల్లి మండలంలోని వీరారెడ్డిపల్లి. పేరు మంద చంద్రయ్య(55). తనకున్న ఎకరన్నరలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో సాగు నీళ్లందక సుమారు 5 బోర్లు వేసినా ఫలితం దక్కలేదు. ఎకరన్నరలో వేసిన పత్తి, వరి పంటలు పూర్తిగా ఎండిపోవడంతో మనోవేదనకు గురై ఫిబ్రవరి 23న వ్యవసాయ క్షేత్రం వద్ద పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.