రామగిరి, జూన్ 13 : విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం పాఠశాలల సంఖ్యను పెంచాలని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. శనివారం టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా కమిటీ సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బక్కా శ్రీనివాసా చారి అధ్యక్షతన యూటీఎఫ్ భవన్ లో జరగగా అలుగుబెల్లి నర్సిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యూటీఎఫ్ కార్యకర్తలు ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు పెంచడానికి కృషి చేయాలన్నారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నేడు పాలనలో, ప్రతిపక్షంలో ఉన్న మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రభుత్వ బడుల మూసివేతపై నోరు మెదపడం లేదని ఆరోపించారు. పారిశ్రామీకరణ, పట్టణీకరణ మూలంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువ దంపతుల వలసలతో నగరాలలో పెరిగిన జనాభాకు అనుగుణంగా నేడు ప్రభుత్వ బడులు లేవని, జనాభా పెరుగుదలకు అనుగుణంగా నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, నకిరేకల్, చండూరు లాంటి పట్టణ ప్రాంతాలలో ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ బడులు ఏర్పాటు చేయాలని సీఎంను డిమాండ్ చేశారు.
నల్లగొండ పట్టణంలో 44 వేల మంది విద్యార్థులు చదువుతుండగా అందులో కేవలం ఒక 5,000 మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారని, నల్లగొండ పట్టణంలో బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసిన విధంగానే కేశరాజు పల్లి, రామగిరి, జేబీఎస్, అక్కలాయి గూడెం పాఠశాల అభివృద్ధి చేస్తే పట్టణ ప్రాంతంలో ఆర్థికంగా వెనకబడిన ఎంతో మందికి, మధ్య తరగతి వర్గానికి సౌకర్యంగా ఉంటుందని అందుకు స్థానిక మంత్రి చొరవ చూపాలని కోరారు. డిప్యూటేషన్ ల దుమారంపై ఆయన స్పందిస్తూ టీచర్ల సర్దుబాటు విద్యార్థుల సౌకర్యార్థం ఉండాలని, ఉపాధ్యాయుల వ్యక్తిగత అవసరాల కోసం కాదని ఇలాంటి అశాస్త్రీయ డిప్యూటేషన్లు పూర్తిగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నల్లగొండ జిల్లా కమిటీ అక్రమ డిప్యూటేషన్ రద్దు కోసం ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటుందని, అవసరమైతే తాను అక్రమ డిప్యుటేషన్ల రద్దుకై ప్రజలను సైతం సమీకరించనున్నట్లు చెప్పారు.
టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందించాలని, ప్రభుత్వం వాగ్దానం చేసిన విధంగా షూస్ లతో కూడిన కిట్టును అందించాలని, నల్లగొండ జిల్లాలో మంజూరైనటువంటి 124 ప్రీ ప్రైమరీ సెక్షన్లకు అవసరమైన ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా నింపాలని, ప్రభుత్వం హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి విధివిధానాలను రూపొందించి తక్షణమే అమలు పరచాలన్నారు. పీఆర్సీ నివేదికను తెప్పించుకుని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు జులైలో నెలలో ప్రమోషన్లు బదిలీల ప్రక్రియ చేపట్టాలని, రెగ్యులర్ ఎంఈఓ, డిప్యూటీ డీఓ, డీఓలను నియమించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఒకేసారి అల్పాహారం పథకం ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ కార్యదర్శి జి నాగమణి, ఎడ్ల సైదులు, జిల్లా ఉపాధ్యక్షుడు నర్రా శేఖర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు జి.అరుణ, జిల్లా కార్యదర్శులు గేర నరసింహ, శ్రీనివాస్ రెడ్డి, నలపరాజు వెంకన్న, భాను ఆడిట్ కమిటీ సభ్యులు భాను ప్రకాష్, మధుసూదన్, వివిధ కమిటీల కన్వీనర్లు పగిడిపాటి నరసింహ, ప్రభాకర్, బి.సురేందర్ రెడ్డి, ఎరనాగుల సైదులు, శ్యాం కుమార్, శ్రీలత, వరలక్ష్మి, రాగి రాకేశ్, వివిధ మండలాల బాధ్యులు పాల్గొన్నారు.

విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలల సంఖ్యను పెంచాలి : మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి