చందంపేట, మే 31 : నల్లమల అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ జంతువుల సంఖ్య గతం కంటే పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వివిధ రకాల జంతువులు 436 ఉన్నాయని, అందులో సుమారు 12 చిరుతలు ఉండొచ్చని అంచనా వేస్తున్నామని పేర్కొంటున్నారు. అటవీ శాఖ ఆధ్వర్వంలో చేపట్టిన జంతు సంరక్షణ చర్యలే దీనికి ప్రధాన కారణం. వేసవిలో జంతువుల దాహార్తిని తీర్చేందుకు సాసర్ పిట్స్ ఏర్పాటు చేయడం, వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం, ట్యాంకర్ ద్వారా ఎప్పటికప్పుడు తాగునీటిని అందించడం వంటివి జంతువులు పెరుగడానికి ఎంతో దోహదపడ్డాయని చెప్పొచ్చు.

చందంపేట, నేరేడుగొమ్ము మండలాల్లోని నల్లమల అటవీ పరిధిలో పాలపేడ, ఎర్రపేడ, భూదేవిపెంట, చాకలిచెరువు, దయ్యాలగుట్ట, దాసర్లపల్లి, బచ్చాపురం, కాచరాజుపల్లి తదితర ప్రాంతాల్లో సుమారు 78 ట్రాప్ కెమెరాలు, 46 సాసర్స్ పిట్స్(నీటి తొట్టిలు) ఏర్పాటు చేశారు. 26వేల హెక్టార్ల అటవీ ప్రాంతంలో వివిధ రకాల మొక్కలు సైతం నాటారు. ఇక్కడికి అమ్రాబాద్ రిజర్వ్డ్ టైగర్ జోన్ దగ్గర ఉండడంతో ఆ ప్రాంతంలోని జంతువులు సైతం దాహార్తిని తీర్చుకునేందుకు ఇక్కడికి వచ్చినట్లు అధికారులు గుర్తించారు.

కెమెరా ట్రాప్లో కొత్త కొత్త జంతువులను గుర్తించినట్లు ఎఫ్డీఓ సర్వేశ్వర్ తెలిపారు. ఇందులో జింకలు, మనుబోతులు, దుప్పిలు, చిరుత, నెమలి, అటవీ పందులు, అటవీ కోళ్లు, ముళ్ల పందులు, అటవీ కుక్కలు, నక్కలతో పాటు మరికొన్ని రకాల జంతువులు ఉన్నట్లు చెప్పారు. నల్లమల అటవీ ప్రాంతంలో నిరంతర గస్తీ ఉంటుందని, బీట్ ఆఫీసర్లు వాచ్ టవర్ ద్వారా ఇతరులు రాకుండా పర్యవేక్షిస్తారని సర్వేశ్వర్ తెలిపారు.