నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 25 (నమస్తే తెలంగా ణ) : రాడికల్ విద్యార్థి సంఘ నేతగా అనంతరం ఆజ్ఞాతంలోకి వెళ్లి పీపుల్స్‌వార్ ఉద్యమ నేతగా ఆ తర్వాత మావోయిస్టు నేతగా నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ ఉద్యమ చరిత్ర కలిగిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు అలియాస్ ఊకే గణేశ్ అలియాస్ రాజేశ్ తివారీ (65) శకం ముగిసింది. బుధవారం రాత్రి ఒడిశాలోని కందమాల్ జిల్లా బెల్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో హనుమంతు నేలకొరిగారు. చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందిన పాక హనుమంతు బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతూనే ఆర్ఎస్యూలో కీలకంగా పనిచేశారు. ఈ క్రమంలో ఆజ్ఞాతంలోకి వెళ్లి పీపుల్స్‌వార్‌లో చేరారు. పుల్లెంలకు చెందిన పాక పాపమ్మ- చంద్రయ్యకు ఆరుగురు సంతానం. వారిలో హనుమంతు మొదటి సంతానం. హనుమంతుకు ముగ్గురు చెల్లెం డ్లు, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. ప్రాథమిక విద్య పుల్లెంలలో పూర్తి చేసిన హనుమంతు ఇంటర్, డిగ్రీ నల్లగొండలో చదివారు. నల్లగొండ ఎన్జీ కాలేజీలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతుండగానే రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ) అధ్యక్షుడిగా పనిచేశారు. అనంరం అజ్ఞాతంలోకి వెళ్లి అప్పటి పీపుల్స్‌వార్ ఉద్యమంలో చేరారు. మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ జిల్లా, రాష్ట్ర స్థాయి నేతగా పేరొందారు. కొన్ని నెలలుగా కీలక నేతల్లో కొందరు లొంగి పోగా మరికొందరు ఎన్కౌంటర్లలో హతమయ్యారు. హనుమంతు మాత్రం నమ్మిన సిద్ధాంతం కోసం ఉద్యమంలో కొనసాగుతూ వచ్చారు. చివరకు బుధవారం రాత్రి ఒడిశాలోని కందమాల్ జిల్లా బెల్ఘర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని గుమ్మా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో హనుమంతు నేలకొరిగారు.
హనుమంతు ఆచూకీ కోసం ఆయన బంధువులు ఇటీవల తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలిసింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుల్లో ఎక్కువ మంది లొంగుపోతున్న తరుణంలో హనుమంతు కూడా లొంగిపోయి తమతో కలిసి జీవిస్తే బాగుంటుందని బంధువులు భావించారు. చెల్లెలి భర్త, హనుమంతు ఆచూకీ కోసం గాలిస్తూ ఒరిస్సాకు వెళ్లినట్లు తెలిసింది. లొంగిపోయిన కొందరి మావోయిస్టుల ద్వారా హనుమంతు ఆచూకీ కోసం ప్రయత్నించారు. అంతేకాకుండా హనుమంతు బావ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఎక్కడ ఉన్నా లొంగిపోవాలని, ఆయనను కలిసేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. అయితే ఆయన చేసిన ప్రయత్నాలు, విజ్ఞప్తులు హనుమంతుకు చేరలేదని సమాచారం. ఏది ఏమైనా హనుమంతు కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకుండానే హనుమంతు ఎన్కౌంటర్లో మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ముగినిపోయారు.
నల్లగొండ జిల్లాకు చెందిన మావోయిస్టుల్లో సుమారు 20 మంది వరకు వివిధ సందర్భాల్లో ఎన్కౌంటర్లలో మృతి చెందినట్లు పోలీసుల రికార్డులు వెల్లడిస్తున్నాయి. దాదాపుగా పదేండ్లుగా నల్లగొండ జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలు లేనట్లే. అంతకుముందు వివిధ దళాల రూపంలో పీపుల్స్ వార్ గ్రూపు పనిచేసింది. రాచకొండ ఏరియా కమిటీ, కనగల్ దళం, మూసీ ఏరియా కమిటీల పేరుతో విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహించారు. అయితే పోలీసుల కట్టుదిట్టమైన నిఘాతో తాళ్లవెల్లంల ఎన్కౌంటర్, నాంపల్లి పనునూర్ గుట్టల్లో ఎన్కౌంటర్లు, గుర్రంపోడు మండలంలో జరిగిన ఎన్కౌంటర్లల్లో పెద్ద సంఖ్యలో దళాలకు దళాలే తుడిచి పెట్టకుపోయాయి. ఆ తర్వాత జిల్లా ఉద్యమంలో నోముల రమణారెడ్డి, మేకల దామోదర్‌రెడ్డి, జనార్దన్ లాంటి కీలక నేతలు మావోయిస్టు ఉద్యమాన్ని విస్తరించేందుకు కృషి చేశారు. అయితే వీరు కూడా ఎన్కౌంటర్లలో మృతి చెందడంతో ఉద్యమానికి తీవ్ర నష్టం వాటిల్లింది. వైఎస్ హయాంలో మావోయిస్టులతో చర్చల అనంతర జరిగిన పరిణామాలతో క్రమ క్రమంగా జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే అప్పటికే ఉద్యమంలో కీలక నేతగా ఉన్న హనుమంతు నేటి వరకు ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో పనిచేస్తూ చివరకు ఎన్కౌంటర్ అయ్యారు. హనుమంతు తర్వాత ఇక జిల్లా నుంచి ఇద్దరు మాత్రమే మిగిలినట్లు తెలుస్తోంది. చిట్యాల మండలం ఉరమడ్లకు చెందిన మందుగుల భాస్కర్‌రావు 2018లో ఆజ్ఞాతంలోకి వెళ్లి ఉద్యమంలో కొనసాగుతున్నట్లు సమాచారం. గుర్రంపోడు మండలం చామలోని బావికి చెందిన పన్నాల యాదయ్య కూడా 2018 నుంచే ఆజ్ఞాతంలో ఉన్నట్లు తెలిసింది. వీరిరువురూ కూడా ఛత్తీస్‌ఘడ్ ప్రాంత ఉద్యమ కార్యకలాపాల్లోనే కొనసాగుతున్నట్లు సమాచారం.