నకిరేకల్ జులై 02 : ప్రభుత్వ డిగ్రీ కళాశాల నకిరేకల్ విద్యార్థుల్లో ప్రతిభను, పోటీతత్వాన్ని, ప్రమాణాలను పెంచేందుకై ఏర్పాటు చేసిన స్వర్ణ పతకం కోసం పాలెం గ్రామ వాస్తవ్యులు నోముల మురళి రిటైర్డ్ ఎస్పీ, ఆయన సోదరులు తమ తల్లిదండ్రులు దివంగత మంగమ్మ, రాములు జ్ఞాపకార్థం రూ.1,25,000 నగదును విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ బెల్లి యాదయ్య బుధవారం తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రవచించిన ”పే బ్యాక్ టు సొసైటీ” నినాదాన్ని అనుసరిస్తూ ప్రతి ఏటా కళాశాల టాపర్ కు ప్రదానం చేయనున్న స్వర్ణ పతకం కోసం శాశ్వత నిధికి విరాళం అందించిన నోముల మురళి సోదరులకు ఎమ్మెల్యే వేముల వీరేశం, పట్టణ ప్రముఖులు, విద్యార్థి సంఘాలు, కళాశాల డోనర్స్ కమిటీ, సిబ్బంది అభినందనలు తెలియజేశారు. నకిరేకల్ ప్రాంతం ప్రతిభావంతుల నెలవు కావాలన్న నోముల సోదరుల ఆశయాలకు అనుగుణంగా విద్యార్థుల్లో నిరంతరం ప్రేరణ కల్పిస్తూ, ప్రతిభను పెంచేందుకు తమవంతుగా ప్రయత్నిస్తామని బెల్లి యాదయ్య తెలిపారు. అడ్వకేట్ నోముల గోవిందరాజులు తమ సోదరుల తరఫున విరాళం చెక్కును అందించారు.