హాలియా, మే 20 : ప్రభుత్వానికి అందాల పోటీ నిర్వహణపై ఉన్న శ్రద్ధ అన్నదాతల సమస్యలు పరిష్కరించడం మీద లేదని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. హాలియాలోని ఆయన నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర కావస్తున్నా ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక పోయిందన్నారు. ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాల అమలుకే డబ్బు సరిపోవడం లేదని, మీరు నన్ను కోసినా డబ్బులేదని సీఎం రేవంత్ చెప్పిన మాటలకు ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం పోయిందని విమర్శించారు.
సీఎం రేవంత్ మాటలు రాష్ట్ర ప్రతిష్ట, ప్రజల ఆత్మైస్థ్యెర్యాన్ని దెబ్బతిసే విధంగా ఉన్నాయన్నారు. సీఎం రేవంత్ చెప్పే మాటలు, చేసే పనులకు పొంతన లేదని, ఊసరవెల్లి కూడా ఆయనను చూసి సిగ్గుపడుతుందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు అస్తవ్యస్తంగా ఉందన్నారు. ఐకేపీ సెంటర్లలో కనీస సదుపాయాలు లేవని, గన్నీ బస్తాలు లేవని, మిల్లుకు తరలించేందుకు లారీల కొరత నెలకొన్నదన్నారు. సాగర్ ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డి గురివింజ నీతులు వల్లిస్తున్నాడని, ప్రభుత్వం ఇచ్చే క్వింటాకు 500 బోనస్ కాజేసేందుకు ఎమ్మెల్యే అనుచరులు ఆంధ్రా నుంచి లారీల్లో ధాన్యం తీసుకొస్తున్నారని ఆరోపించారు. వాటిని ఐకేపీ కేంద్రాల్లో అక్రమంగా విక్రయిస్తూ ప్రభుత్వ ఖజానాకు కన్నం పెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సాగర్ నియోజకవర్గ పేదలకు ఒరిగిందేమి లేదని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని కాంగ్రెస్ కార్యకర్తలకు అందిస్తున్నారని ఆరోపించారు.
కృష్ణానది జలాలను ఆంధ్రా దోపిడీకి పాల్పడుతుంటే అడ్డుకోడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమమైందని విమర్శించారు. ఆగస్టు మొదటి వారం నుంచి డిసెంబర్ చివరి వరకు నిండు కుండలా ఉన్న సాగర్ జలాశయం నేడు డెడ్ స్టోరేజీకి చేరుకుందన్నారు. వచ్చే నెల నుంచి వానకాలం సీజన్ ప్రారంభమవుతుడడంతో వరి నారు పెంచేందుకు రైతులకు నీళ్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదని ఆరోపించారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కురాకుల వెంకటేశ్వర్లు, పిడిగం నాగయ్య, నాగులవంచ తిరుపతిరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కామర్ల జానయ్య, పట్టణాధ్యక్షుడు వడ్డే సతీశ్‌రెడ్డి, వెంకటాచారి, పాక్స్ వైస్ చైర్మన్ గుండెబోయిన వెంకన్న, పోదిల శ్రీనివాస్, సురబి రాంబాబు, మాజీ ఎంపీటీసీ పెద్దమాము యాదయ్య, రాయనబోయిన రామలింగయ్య, సర్పంచ్ రాములు, శంకర్, సందీప్ ఉన్నారు.