నల్లగొండ, నవంబర్ 17 : ప్రభుత్వం మత్స్యకారులకు అందించే ఉచిత చేప పిల్లల విడుదలలో పారదర్శకత లేదు. క్వాలిటీ లేదు, క్వాంటిటీలో చిత్త శుద్ధి లేదు. చేప పిల్లల్లో దెయ్యం చేప పిల్లల విడుదల..ఇదీ నల్లగొండ జిల్లాలోని మత్స్యశాఖ యంత్రాం గం తీరు. అక్రమాలను అధికార పార్టీ ఎమ్మెల్యేలు గుర్తించినా పట్టడం లేదు. వరుసగా నమస్తే తెలంగాణలో వార్తా కథనాలు ప్రచురితమైనా చర్యలు లేవు. నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు అధికారులు. ఈ నెల 4న నల్లగొండ పట్టణంలోని చర్లపల్లితోపాటు మండల పరిధిలోని నర్సింగ్‌బట్లలో పోసిన చేప పిల్లల్లో వచ్చిన దెయ్యం చేప పిల్లలపై .
5న చేప పిల్లల క్వాంటిటీ, క్వాలిటీలో నాణ్యత లోపంపై నమస్తే తెలంగాణ వెలుగులోకి తెచ్చింది. ఈ నెల 11న నకిరేకల్‌లో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం గుర్తించి 67,500 చేపిపిల్లలకు గానూ 54వేలు మాత్రమే పోశారని నిలదీశారు. ఈ నెల 14న అడవి దేవులపల్లిలో స్థానిక శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి చిన్న పిల్లలు పోస్తున్నారని రిజెక్ట్ చేశారు. ఇవన్నింటికీ అధికారుల వద్ద ఒక్కటే సమాధానం చేపి పిల్లలు పోసే కాంట్రాక్టర్‌కు నోటీసులిచ్చామని. నోటీసులకు వారి వివరణ ఏమిటి?
తర్వాత కూడా ఎందుకు పరిస్థితి చక్కబడటం లేదని వారు దృష్టి సారించడం లేదు. ఒకటి నాలుగు సార్లు నోటీసులివ్వడం తప్ప చర్యలు లేవా అనేది వారికే తెలియాలి. కాంట్రాక్టర్లు ఎంతైనా అధికార పార్టీ నేతలు కదా.. నోటీసులు తప్ప ఇంకా ఏం చేస్తాములెండి అనే మాటలు అదే శాఖలో వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే వీరేశం తక్కువ వచ్చాయని చెప్పిన 13వేల చేప పిల్లలు పోయనేలేదని, బత్తుల వెనక్కి పంపిన అదే పిల్లలు కాసేపు అయ్యాక పోశారే తప్ప పెద్ద పిల్లలు పోయలేదనే ఆరోపణలు ఆయా సంఘాల వారు చెప్పడం గమనార్హం.