గుండాల, సెప్టెంబర్ 20 : రైతులందరికీ రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ మాటలు నీటిమూటలే అయ్యాయి. ప్రభుత్వం కొర్రీల మీద కొర్రీలు పెడుతూ రైతులను రుణమాఫీకి దూరం చేస్తున్నది. అసైన్డ్ భూములకు సైతం బీఆర్ఎస్ సర్కారులో రుణమాఫీ వర్తించగా.. ఇప్పుడు మాత్రం డీసీసీబీ అధికారులు చార్జ్ క్రియేషన్ అవడం లేదంటూ రైతుల ఖాతాలో నగదు జమ చేయడం లేదు.
గుండాల మండల పరిధిలో ప్రభుత్వం నుంచి గతంలో అసైన్డ్ భూమి పొందిన వందలాది రైతులకు రుణమాఫీ మంజూరైనా రుణమాఫీ అవడం లేదు. అసైన్డ్ భూమి ఉండి మోత్కూర్ డీసీసీబీ మోత్కూరు శాఖలో పంట రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ అయినా అయినట్టు ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో పేరు వచ్చినా, అసైన్డ్ భూములు ప్రొహిబిటెడ్ కాలమ్లో ఉన్నాయన్న సాకు చూపుతూ మాఫీ చేయడం లేదు. దాంతో బాధిత రైతులు మోత్కూరులోని డీసీసీబీ, గుండాల తాసీల్దార్ కార్యాలయం, పీఏసీఎస్ చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు.
బ్యాంకు అధికారు లు మాత్రం చార్జ్ క్రియేషన్ కాకపోవడం రుణమాఫీ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవ డం లేదని చెప్తున్నారు. చార్జ్ క్రియేషన్ కాకుం డా రుణమాఫీ నగదు ఖాతాలో జమ చేసేందుకు వీలు ఉండదని, అలా చేస్తే సదరు రైతు అదే భూమిపై మరొక బ్యాంకులో రుణం తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. రైతుల అసైన్డ్ భూమి సర్వే నెంబర్లను ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ నుంచి తొలగిస్తేనే తమ కు చార్జ్ క్రియేషన్ అవుతుందని పేర్కొంటున్నారు.
ఇది రెవెన్యూ శాఖ పరిధిలోని విషయమని, ఆ శాఖ అధికారులను కలవాలని సూచిస్తున్నారు. ఒక రైతుకు కొంత అసైన్డ్ భూమి ఉండి, మిగతా సొంత భూమి ఉన్నా రుణమాఫీ అవడం లేదు. కాగా, గతంలో ఇవే భూములపై బీఆర్ఎస్ సర్కారులో పంట రు ణం మాఫీ అయ్యిందని, కాంగ్రెస్ ప్రభు త్వం ఎందుకు చేయదని రైతులు ప్రశ్నిస్తున్నారు.
చార్జ్ క్రియేషన్ లేకుండా రుణమాఫీ చేయలేం
ప్రభుత్వ భూమి కలిగిన రైతుల పేర్లు రుణమాఫీ లిస్టులో వచ్చినప్పటికీ వారి పేరుపై చార్జ్ క్రియేషన్ అయితేనే రైతు ఖాతాలో జమ అవుతుంది. చార్జ్ క్రియేషన్ లేకుండా రుణం ఇస్తే ఆ రైతు మరొక బ్యాంకులో అదే భూమిపై రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. వారికి రుణమాఫీ వర్తించాలంటే ఆ భూములను ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ కాలమ్ నుంచి తొలగించాలి.
-అమరేందర్ రెడ్డి, డీసీసీబీ మేనేజర్, మోత్కూర్ బ్రాంచ్
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం
అసైన్డ్ భూమి ఉండి రుణమాఫీ కాని రైతుల సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. కలెక్టర్ ఆదేశాల మేరకు బ్యాంకు అధికారులతో మాట్లాడి రుణమాఫీ వర్తించేలా చూస్తాం.
-జల కుమారి, తాసీల్దార్, గుండాల
బీఆర్ఎస్ సర్కారులో మాఫీ అయ్యింది.. ఇప్పుడెందుకు కాదు?
నా పేరు మీద ఎకరం 20 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. దాని మీద మోత్కూర్ డీసీసీబీలో పంట రుణం తీసుకున్నాను. ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ జాబితాలో నా పేరుంది. బ్యాంకు వెళ్లి పత్రాలన్నీ ఇచ్చాను. ఇప్పటికీ నా ఖాతాలో రుణమాఫీ జమ కాలేదు. బ్యాంకు అధికారులను రెవెన్యూ అధికారులను కలవండి అంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాకు రుణమాఫీ అయ్యింది. ఇప్పుడెందుకు చేయడం లేదో అర్థమైతలేదు. బ్యాంకు చుట్టూ, రెవెన్యూ ఆఫీసర్ల చుట్టూ తిరిగి తిరిగి యాష్ట కొస్తున్నది.
-పందుల మల్లేశ్, రైతు, పాచిల్ల గ్రామం, గుండాల మండలం