– గుర్రంపోడు తాసీల్దార్ ఎన్. కురుణశ్రీ
గుర్రంపోడు, మార్చి 25 : బీఎల్ఓలు (బూత్ స్థాయి అధికారులు) గ్రామాల్లో ఎన్నికల నిబంధనల ప్రకారం బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని గుర్రంపోడు తాసీల్దార్ ఎన్. కరుణశ్రీ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో బీఎల్ఓలకు, బీఎల్ సూపర్వైజర్లకు ప్రత్యేక ఓటరు జాబితా ప్రక్షాళనపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాసీల్దార్ మాట్లాడుతూ కొత్త ఓటర్ల నమోదు, జాబితాలో మార్పులు-చేర్పులు, మరణించిన వారి పేర్ల తొలగింపు, పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతుల కల్పనపై అవగాహన కల్పించారు. ఓటరు జాబితా సవరణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. తప్పులు దొర్లితే బీఎల్ఓలదే బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ డీటీ మల్లికార్జున్ రావు, జూనియర్ అసిస్టెంట్లు గోవర్థన్, యాదగిరి, రామకృష్ణ, సందీప్, జీపీఓలు శ్రీనివాస్, పురుషోత్తం పాల్గొన్నారు.