హైదరాబాద్ , ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు సాధించడమే లక్ష్యంగా ముందుకుసాగాలని, సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రయోజనాల కోసం సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సోమవారం ఆయన సహచర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ బలరాంనాయక్ తదితరులతో కలిసి ఇరిగేషన్ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు అంశాలతోపాటు పర్యావరణ అనుమతులపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఈ భేటీలో చర్చించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలకమైన పాలమూరు-రంగారెడ్డి, డిండి, గౌరవెల్లి, సీతమ్మసాగర్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు సాధించేందుకు పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగాలని, ఆరు నెలల్లోగా ఈ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు.
న్యాయస్థానాల్లో కొనసాగుతున్న కేసులు, పాటించాల్సిన నిబంధనలు, జరిమానాలు తదితర వివరాలన్నీ ఒకే సమగ్ర దస్త్రంలో పొందుపరచాలని, ప్రతి ప్రాజెక్టుకూ ప్రత్యేక నోడల్ అధికారిని నియమించి, అందుబాటులో ఉన్న పత్రాలు, రికార్డులన్నింటినీ ఏడు రోజుల్లోగా సమీకరించాలని స్పష్టం చేశారు. దరఖాస్తుల తయారీ, పరిశీలన, సమర్పణకు సంబంధించిన దశలను 60 రోజుల్లోగా పూర్తిచేయాలని సూచించారు. ప్రాజెక్టుల పురోగతిపై ప్రతి వారం నివేదిక సమర్పించాలని పేర్కొన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పంప్‌హౌస్‌ను పూర్తిస్థాయిలో నిర్వహణకు సిద్ధం చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని, ఎడమ, కుడికాలువ పనులకు అంచనాలు సిద్ధం చేయాలని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ వల్ల తెలంగాణలో ఏర్పడే ముంపుపై శాస్త్రీయ అధ్యయనం చేపట్టాలని, సూచించారు.