న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి రోడ్డుపై పాదచారుల కోసం ప్రత్యేక మార్గం ఉండేలా చూడాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఓ రోడ్డు ప్రమాదం కేసుపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ మేరకు అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్‌కు సూచించింది. ‘పెద్దగా పెట్టుబడి, నిర్మాణాల అవసరం లేకుండానే పాదచారుల కోసం కేటాయించిన స్థలాన్ని ప్రత్యేకంగా గుర్తించండి.
ఎక్కడ రోడ్డు ఉంటే.. అక్కడ పాదచారుల కోసం ప్రత్యేక ప్రదేశం ఉండాలి. అది తాడుతోనైనా లేక ఇంకా ఏ విధంగానైనా సరే రోడ్డుపై పాదచారులకు ప్రత్యేక మార్గం ఉండాలి, ఆ స్థలం ఆక్రమణకు గురికాకుండా చూసుకోవాలి’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీచేసేందుకు కేంద్ర సర్కార్‌కు రెండు వారాల గడువునిచ్చింది.