Actor Prakashraj : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో తొలగించిన ఓట్లన్నింటిని తిరిగి ఓటర్ల జాబితాల్లో పునరుద్ధరించాలని నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాష్‌రాజ్ (Prakashraj) డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన ఓటర్ల జాబితాల (Voters list) ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్దేశపూర్వకంగానే కొందరి ఓట్లను తొలగించేందుకు ఈ ప్రక్రియ చేపట్టారని ఆరోపించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ప్రకాష్‌రాజ్ డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో దేశవ్యాప్తంగా సుమారు 13.4 కోట్ల మంది ఓటర్ల పేర్లను ముసాయిదా జాబితాల నుంచి తొలగించడం తీవ్ర వివాదానికి దారితీసింది. ముఖ్యంగా వలస కార్మికులు, దళితులు, ముస్లింల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగిస్తున్నారని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. ఇప్పటికే ఏటా ఓటర్ల జాబితా పరిశీలన జరుగుతుండగా.. కొత్తగా ఈ ప్రత్యేక సవరణ ఎందుకని ఆయన ప్రశ్నించారు.
దేశంలో అక్రమ చొరబాటుదారులు ఉంటే ఇన్నాళ్లూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏం చేసింది..? అని ప్రకాష్‌రాజ్ నిలదీశారు. ఇంట్లోలేని వాళ్ల ఓట్లను తీసేశారని మండిపడ్డారు. ముస్లింలు, దళితుల ఓట్లను తొలగించడమే వారి ముఖ్య ఉద్దేశమని ఆరోపించారు. మరోవైపు దేశవ్యాప్త నిరసనల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. జాబితాల నుంచి పొరపాటున తొలగించిన అర్హులైన ఓటర్ల పేర్లను తిరిగి చేర్చేందుకు నెల రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.