
సంస్థాన్ నారాయణపురం, జనవరి10 : వృద్ధురాలు గుండమల్ల దాశమ్మ పూర్తి బాధ్యతలు తీసుకుంటానని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హామీనిచ్చారు. ‘నమస్తే తెలంగాణ’ పత్రిక మినీలో ఆదివారం ప్రచురితమైన ‘దాశమ్మా.. ఎంత కష్టం వచ్చిందమ్మా’ కథనానికి ఆయన స్పందించారు. కర్నె ప్రభాకర్ ఆదేశానుసారం నారాయణపురం సర్పంచ్ శ్రీహరి షాదీఖానా వరండాలో ఇబ్బందులు పడుతున్న దాశమ్మను సోమవారం పరామర్శించి యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నెలకు సరిపడా నిత్యావసర సరుకులు, దుప్పట్లు అందించారు. సంక్రాంతి తర్వాత ఇల్లు నిర్మించి ఇస్తానని, ఎప్పుడు ఏ సహాయం అవసరమున్నా సంప్రదించాలని కర్నె ప్రభాకర్ సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ భిక్షం, గణేశ్సాగర్, గుండమల్ల సతీశ్‌కుమార్, ఉప్పల వెంకటేశ్, ఉప్పల రాజయ్య, సత్తయ్య పాల్గొన్నారు.
రెండు నెలల్లో ఇంటి నిర్మాణం
రెండు నెలల్లో రెండు గదుల ఇంటి నిర్మాణం పూర్తి చేయిస్తా. ఉన్నతాధికారులతో మాట్లాడి సదరం సర్టిఫికెట్ సమస్యను త్వరలోనే పరిష్కారిస్తా. ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో ప్రచురితమైన దాశమ్మా.. ఎంత కష్టం వచ్చిందమ్మా కథనం తన మనస్సుకు తాకింది.