నల్లగొండ విద్యా విభాగం(రామగిరి), మే 02 : ఈ నెల 4న నిర్వహించనున్న నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్ ) అండర్ గ్రాడ్యుయేషన్ -2025 ప్రవేశ పరీక్షకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో సర్వం సిద్ధం చేసినట్లు నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. నీట్ ప్రవేశ పరీక్షపై శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నీట్ పరీక్షకు జిల్లా కేంద్రంలో 7 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో 2,087 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు.
– యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ ఎంజీ యూనివర్సిటీ అన్నెపర్తి
– యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఎంజీ యూనివర్సిటీ
– యూనివర్సిటీ సైన్స్ కళాశాల ఎంజీ యూనివర్సిటీ
– యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఎంజీ యూనివర్సిటీ
– నాగార్జున ప్రభుత్వ కళాశాల(ఎన్జీ), నల్లగొండ
– ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల రామగిరి, నల్లగొండ
– కేంద్రీయ విద్యాలయం మిర్యాలగూడ రోడ్, నల్లగొండ.
నీట్ – 2025 ప్రవేశ పరీక్ష మే 4న మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని, అభ్యర్థులు ఉదయం 11 గంటల వరకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు. బయోమెట్రిక్ అటెండెన్స్, తనిఖిని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు ఉదయం 11కే చేరుకోవాలని, మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్ష కేంద్రం గేట్లను మూసి వేయడం జరుగుతుందని తెలిపారు.
అడ్మిట్ కార్డులో ఉన్న సూచనలన్నింటిని తు.చ తప్పకుండా పాటించాలని, ఇటీవలి పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫొటో ఒకటి, అలాగే
4 × 6 పోస్ట్ కార్డు సైజు కలర్ ఫొటోతో రావాలని తెలిపారు. గుర్తింపు కోసం డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ లేదా కళాశాల జారీ చేసిన గుర్తింపు కార్డు లేదా ఇతర ఏదో ఒక గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలని చెప్పారు.
ఆభరణాలు, భారీ దుస్తులు, బూట్లు ధరించి పరీక్ష కేంద్రంలోకి రాకూడదు. పరీక్షా కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించడం జరగదు. అలాగే జామెట్రిక్ బాక్సులు, మొబైల్ ఫోన్, బ్లూటూత్, వాలెట్, రిస్ట్ వాచ్, కెమెరా, బెల్ట్, గాగుల్స్, ఆహార పదార్థాలు, వాటర్ బాటిల్, పెన్, స్కేల్, రైటింగ్ ప్యాడ్, లాగ్ టేబుల్, క్యాలిక్యులేటర్లు అనుమతించడం జరగదని తెలిపారు. పెన్ను కూడా పరీక్ష కేంద్రంలోనే ఇవ్వడం జరుగుతుందన్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద సీసీటీవీల ఏర్పాటు, జిరాక్స్ కేంద్రాల మూసివేత, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144వ సెక్షన్ విధింపు, తాగునీరు, మెడికల్ కిట్, ఓఆర్ఎస్ ప్యాకెట్ల ఏర్పాటు వంటి వాటిపై ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. నీట్ పరీక్షలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే అభ్యర్థులు టోల్ ఫ్రీ నంబర్ 1800 425 1442 కు ఫోన్ చేయాలని సూచించారు. ఇన్చార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ రాజకుమార్, నీట్ పరీక్ష నోడల్ ఆఫీసర్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, సమాచార శాఖ సహాయ సంచాలకులు యు.వెంకటేశ్వర్లు సమావేశంలో పాల్గొన్నారు.