నిడమనూరు, ఆగస్టు 23: వ్యవసాయానికి త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరాలో సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహించిన ఐదు గ్రామాల అన్నదాతలు శనివారం అర్ధరాత్రి ఫీడర్లను ఆపేసి ఆందోళనకు దిగిన ఘటన రేగులగడ్డ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద జరిగింది. వరి నాట్లు వేసి నెలరోజులు గడుస్తున్నా సరిపడా నీరందక ఎండుతున్న పరిస్థితికి తోడు విద్యుత్ సరఫరా ఇష్టారాజ్యం కావడంతో రైతులు సబ్‌స్టేషన్‌ను ముట్టడించి రెండు గంటల పాటు ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ వారం రోజులుగా రెండు గంటలు కూడా విద్యుత్ సరఫరా కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోతల విషయమై సమాచారం లేకుండా సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. భూగర్భజలాలు అడుగంటిన పరిస్థితితో వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి నాటు వేసిన రైతాంగం నష్టానికి గురయ్యే ప్రమాదముందన్నారు. విద్యుత్ కోతలతో మోటార్లు నడవకపోవడంతో నీరందించలేక పోతున్నామన్నారు.
నిరంతరాయంగా త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పంటలు కళ్లముందు ఎండిపోతున్నా ప్రభుత్వ తీరుతో కాపాడుకోలేని అయోమయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నామన్నారు. విద్యుత్‌ను సరఫరా చేసి పంటలు ఎండిపోకుండా ఆదుకోవాలని కోరారు. హాలియా ఏడీఏ తిరుపతయ్యకు సమాచారమిచ్చారు. ఏడీఏ హామీ మేరకు రైతులు ఆందోళనను విరమించారు. రేగులగడ్డ, నారమ్మ గూడెం వల్లభాపురం, కక్కయ్య గూడెం, అన్నారావు క్యాంపు రైతులు పాల్గొన్నారు.