నీలగిరి, సెప్టెంబర్ 06 : బాధితులకు పూర్తి నష్ట పరిహారం చెల్లించిన తర్వాతే జాతీయ రహదారి 565 నిర్మాణ పనులు ప్రారంభించాలని నిర్వాసితుల పోరాట కమిటీ గౌరవాధ్యక్షుడు సయ్యద్ హాశం, మాజీ కౌన్సిలర్ ఎండీ సలీం, ఉట్కూరు వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం 565 జాతీయ రహదారి బైపాస్ రోడ్డు నిర్వాసితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో గిరికబాయిగూడెం బైపాస్‌లో ధ్వంసం చేసిన పంట పొలాలను పరిశీలించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పానగల్ నుండి సాగర్ రోడ్డు వరకు బైపాస్ నిర్మాణంలో 35 శాతం మంది బాధితులకు నోటీసులు కానీ నష్ట పరిహారం కానీ అందలేదన్నారు. నోటీస్, నష్ట పరిహారం ఇవ్వకుండా శుక్రవారం కాంట్రాక్టర్లు ఊట్కూరు వెంకట్ రెడ్డి సర్వే నంబరులో కోతకు దశకు వచ్చిన వరి పొలాన్ని ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఎక్కడా పనులు పూర్తికాక ముందే పంట పొలాలు ధ్వంసం చేయడం ఏంటని వారు ప్రశ్నించారు. పూర్తి నష్టపరిహారం చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభించాలని, పంట మీద ఉన్న పొలాలకు కొంత సమయం ఇచ్చి పనులు చేయాలని కోరారు.
565 జాతీయ రహదారి బైపాస్ కోసం భూములు కోల్పోతున్న రైతులకు సరైన నష్ట పరిహారం ఇవ్వకుండా పనులు ప్రారంభించడం సరికాదని, నష్ట పరిహారం ఇవ్వాలని రైతాంగం చేస్తున్న పోరాటానికి సీపీఎం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ఆ పార్టీ నల్లగొండ పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య అన్నారు. నల్లగొండ పట్టణంలో ఎకరం రూ.2 కోట్లు ధర ఉండగా రూ.10 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తామని రైతులను నష్టపరుస్తూ చేస్తున్న ప్రభుత్వ విధానాలు మానుకోవాలని, రైతాంగానికి బహిరంగ మార్కెట్ కు రెండంతల ధర పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ అశోక్ రెడ్డికి భూ నిర్వాసితుల పోరాట కమిటీ తరఫున వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితులు ఉట్కూరు వెంకట్ రెడ్డి, మహేశ్, రఘురామరాజు, మల్లారెడ్డి, దుబ్బాక నాగేశ్, దుబ్బాక మల్లేశ్, దొండ వెంకన్న, మర్రి ముత్తయ్య, బుర్ర శంకరయ్య, బుర్ర లింగయ్య, మందడి పద్మమ్మ, నిదానంపల్లి కృష్ణయ్య, మందడి వెంకట్ రెడ్డి, బీపంగి కిరణ్ కుమార్, ఎం.శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
Nilagiri : పూర్తి నష్ట పరిహారం తర్వాతే జాతీయ రహదారి 565 పనులు చేపట్టాలి : సయ్యద్ హాశం