హుజూర్నగర్, ఏప్రిల్ 17 : కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకే నూతన కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి, సూర్యాపేట జిల్లా పోర్టు పోలియో జడ్జి రాధారాణి తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్కు నూతనంగా మంజూరైన అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును గురువారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వినోద్ కుమార్, జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ సుజనతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హుజూర్నగర్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు పరిధిలో పెండింగ్ కేసుల సంఖ్య అధికంగా ఉందని ఈ కేసుల పరిష్కారానికి నూతన కోర్టు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నూతన కోర్టుల సముదాయాన్ని, అలాగే న్యాయమూర్తుల వసతి గృహాల నిర్మాణాల కోసం బార్ అసోసియేషన్ సభ్యులు రాంరెడ్డి ఆధ్వర్యంలో నిరంతరం కృషి చేసి ప్రభుత్వం నుండి నాలుగు ఎకరాల స్థలాన్ని కేటాయింపు చేసుకోవడం సంతోషకరమన్నారు.
హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. హుజూర్నగర్ న్యాయవాదుల చిరకాల వాంఛ ఈ నూతన కోర్టు ప్రారంభోత్సవంతో నెరవేరినట్లుగా భావిస్తున్నానన్నారు. పాలకవీడు, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలోని క్రిమినల్ కేసులు ఆయా మండలాల లోని సివిల్ కేసులు మొత్తం 3,067 కేసులను నూతన కోర్టుకు కేటాయించినట్లు చెప్పారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడి విన్నపం మేరకు త్వరలోనే నూతన కోర్టుకు న్యాయమూర్తిని కేటాయించడానికి ప్రయత్నిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
జస్టిస్ సుజన మాట్లాడుతూ.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 8 వేల కేసులు మాత్రమే పెండింగ్ లో ఉండగా ఒక్క హుజూర్నగర్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో 8,500 కేసులు పెండింగ్లో ఉండడం ఆశ్చర్యపరిచిందన్నారు. పెండింగ్ కేసుల భారాన్ని పరిగణలోకి తీసుకుని బార్ అసోసియేషన్ విన్నపం మేరకు నూతన కోర్టును మంజూరు చేశామన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల రాంరెడ్డి మాట్లాడుతూ.. న్యాయమూర్తుల వసతి గృహాల నిర్మాణానికి హైకోర్టు న్యాయమూర్తులు అనుమతులు జారీ చేయాలని అలాగే నూతన కోర్టుకు సాధ్యమైనంత త్వరలో న్యాయమూర్తిని కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.
సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ శ్యామ్ శ్రీ మాట్లాడుతూ హుజూర్నగర్ న్యాయవాదుల అభ్యర్థన మేరకు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును మంజూరు చేయడం పట్ల హైకోర్టు న్యాయమూర్తులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో హుజూర్నగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ శ్యామ్ శ్రీ తో పాటు పలువురు న్యాయమూర్తులను గజమాలలు, శాలువాలు, బొకేలతో ఘనంగా సత్కరించి వారికి మెమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట సీనియర్ సివిల్ జడ్జీలు జిట్టా శ్యామ్ కుమార్, సురేశ్, పర్వీన్ కౌసర్, జూనియర్ సివిల్ జడ్జి భవ్య శ్రీ పాల్గొన్నారు.