యాదగిరిగుట్ట, జనవరి 21 : ఒకవైపు టెంపుల్ సిటీ కొండ.. మరోవైపు యాదగిరికొండ. మధ్యలో అద్భుతంగా.. ఆహ్లాదకరంగా రూపుదిద్దుకుంటున్న నెట్ వర్క్ ఆర్చ్ బ్రిడ్జి. ఈ బ్రిడ్జి కొండపైకి వెళ్లేందుకు మాత్రమే కాదు.. అక్కడికి వచ్చి చుట్టూ గుట్ట, స్వామివారి కొండను చూసి ఆహ్లాదం పొందే విధంగా ఆవిష్కృతం కానున్నది. రాష్ట్రతొలి సీఎం కేసీఆర్ కలలు కన్న ఈ నెట్ వర్క్ ఆర్చ్ బ్రిడ్జి భక్తులను కొండపైకి తీసుకెళ్లడమే కాదు.. మరెంతగానో కనువిందు చేయనున్నది. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి క్షేత్రం అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం రూ. 1300 కోట్లు కేటాయించి, మహాద్భుతంగా తీర్చిదిద్దడమేకాదు. కొండచుట్టూ ఉన్న ప్రాంతాన్ని కూడా అదేరీతిలో తీర్చిదిద్దారు. ఇం దులో భాగంగానే యాదగిరిశ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకునేందుకు కొండపైకి వెళ్లే భక్తులకు ప్రత్యేకమైన నెట్వర్క్ ఆర్చ్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా లండన్ నుంచి నెట్వర్క్ ఆర్చ్ బ్రిడ్జికి సంబంధించిన విడిభాగాలను దిగుమతి చేసి బిగింపు ప్రక్రియ చేపట్టారు.
నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలనుసారం కొండపైకి వెళ్లేందుకు ప్రత్యేకమైన రోడ్లు నిర్మించారు. కొండపైకి వెళ్లి, తిరిగి వచ్చేందుకు ప్రధానంగా ఎగ్జిట్, ఎంట్రీ ఫ్లై ఓవర్లు నిర్మించేందుకు అప్పటి ప్రభుత్వం రూ. 69 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ. 35 కోట్లతో నిర్మించిన ఎగ్జిట్ ఫ్లై ఓవర్‌ను 2022 మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా స్వామివారి ఆలయం పునఃప్రారంభమైన రోజునే అందుబాటులోకి తెచ్చారు. అలాగే కొండపైకి వెళ్లే భక్తులకు మరింత ఆసక్తి, ఉత్సాహం ఉండాలనే లక్ష్యంతో ప్రత్యేకమైన ఎగ్జిట్ నెట్వర్క్ ఆర్చ్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం రూ. 34 కోట్లు కేటాయించారు. స్వయంభూ నారసింహస్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను పునః దర్శనానికి ఆహ్వానించే విధంగా వైటీడీఏ అధికారులు సకల వసతులను కల్పించారు.
కొండపైకి వెళ్లేందుకు గానూ కొండ కింద వైకుంఠ ద్వారం సమీపంలోని ఆర్యవైశ్య సత్రం నుంచి 12 మీటర్ల వెడల్పు, 450 మీటర్ల పొడవుతో మొదటి ఘాట్ రోడ్డు పాత నిత్యన్నదాన భవనం వరకు ఫ్లై ఓవర్‌ను అనుసంధానం చేశారు. ఈ ఫ్లై ఓవర్‌ను 8 పిల్లర్లతో నిర్మించారు. 32 మీటర్ల మేర బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన స్పాన్ పనులు పూర్తి కావడంతో పాటు లండన్ నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేసిన నెట్వర్క్ ఆర్చ్ బ్రిడ్జిలో వినియోగించే 52 మెకనైజ్డ్ బార్స్ బిగింపు ప్రక్రియ దాదాపుగా చివరి దశలో ఉంది. 64 మీటర్ల పొడవులో ఆర్చ్ బ్రిడ్జి రానున్నది. ఇందుకోసం రూ. 34 కోట్లు ఖర్చు చేశారు. పనులు ఇప్పటికే దాదాపు 90 శాతం పూర్తి కాగా మిగతా పనులు పురోగతిలో ఉన్నాయి. త్వరలో పనులు పూర్తి చేసి నెట్వర్క్ ఆర్చ్ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకువస్తామని ఆర్అండ్బీ అధికారులు వెల్లడించారు.