మునుగోడు, జూలై 16 : ఆయిల్‌పామ్ సాగుతో రైతులు నికర ఆదాయం పొందవచ్చని రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమ శౄఖ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ అధికారి బి.బాబు అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామంలో రైతు పగిల్ల లింగస్వామి పొలంలో చేపట్టిన ఆయిల్‌పామ్ మెగా ప్లాంటేషన్‌ను పరిశీలించి ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్ పంట సాగును ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రైతుకి కేవలం రూ.20కే ఒక మొక్క అందిస్తున్నట్లు చెప్పారు. ప్రతి యేటా ఎకరాకు రూ.4,200 సబ్సిడీని, డ్రిప్ పరికరాలను ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, బీసీ, చిన్నకారు రైతులకు 90 శాతం, ఓసీలకు 80 శాతం రాయితీపై అందిస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కో ఎకరాకు ఏడాదికి నికరంగా రూ.1,50,000 ఆదాయం పొందవచ్చన్నారు. నల్లగొండ జిల్లాలో ఆయిల్‌పామ్ సాగుకు అనుకూలమైన నేలలు, నీరు అందుబాటులో ఉన్నందున రైతులు ముందుకు రావాలని కోరారు.
నల్లగొండ జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి అనంతరెడ్డి మాట్లాడుతూ.. మన నల్లగొండ జిల్లాకు ఈ సంవత్సరం ఆయిల్‌పామ్ సాగు లక్ష్యం 6,500 ఎకరాలు. అయితే ఇప్పటికే 6,100 ఎకరాలకు రైతులు దరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గ ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి రావుల విద్యాసాగర్, మునుగోడు మండలం ఏఓ పద్మజ, పతంజలి కంపెనీ నల్లగొండ జిల్లా మేనేజర్ డాక్టర్ కూనిరెడ్డి మధుసూదన్ రెడ్డి, ఆయిల్‌పామ్ ఫీల్డ్ ఆఫీసర్ ప్రసాద్, ఏఈఓ నరసింహ, మునుగోడు మండల పతంజలి ఫీల్డ్ అసిస్టెంట్ పాలకూరి స్వామి పాల్గొన్నారు.
Munugode : ఆయిల్‌పామ్ సాగుతో నికర ఆదాయం : జేడీహెచ్ బాబు