నేరేడుచర్ల, జూన్ 23 : కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను పెంచే విధంగా అడుగులు వేస్తున్నందున అన్ని అర్హతలు ఉన్న నేరేడుచర్లను నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని సీపీఐ పార్టీ సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు డి.ధనుంజయనాయుడు అన్నారు. సోమవారం నేరేడుచర్ల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సూర్యాపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించారని అదే విధంగా నేరేడుచర్లను నియోజకవర్గంగా ప్రకటించాలని కోరారు.
ఇప్పటి వరకు మిర్యాలగూడ, హుజూర్నగర్కు చెందిన వారే శాసనసభ్యులుగా ఉన్నారని, నేరేడుచర్లను నియోకవర్గంగా ఏర్పాటు చేసే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని నేరేడుచర్లను నియోజకవర్గంగా ప్రకటించే విధంగా చూడాలన్నారు. ఈ సమావేశంలో మహిళా సమాఖ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మి, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా సహాయ కార్యదర్శి కొమర్రాజు వెంకట్, ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్షుడు పరికే భరత్, మహిళా సమాఖ్య నాయకురాలు దివ్య పాల్గొన్నారు.