ఆత్మకూర్.ఎస్, జనవరి 07 : ఆత్మకూర్.ఎస్ మండలంలోని నెమ్మికల్ సంత వేలం పాటను రద్దు చేసి పాటదారుడిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు బూడిగే సైదులు, అనిల్ కుమార్, వెంకట్ రెడ్డి, నాగరాజు డిమాండ్ చేశారు. నెమ్మికల్ గ్రామ పంచాయతీ సంత వేలం పాట 24.12.2025 న నిర్వహించగా నార్కెట్పల్లికి చెందిన దూదిమెట్ల వెంకటేశ్వర్లు రూ.52.99 లక్షలకు దక్కించుకున్నాడు. సదరు పాటదారుడు నిబంధన ప్రకారం 24 గంటల్లో వన్ బై థర్డ్ వాటా చెల్లించాలి. అలాగే 31.12.2025 నాడు గ్రామ పంచాయతీకి మిగతా డబ్బులను తన భూమిని మార్టిగేజ్ చేయాలి.
అయితే నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు వరకు కూడా రిజిస్ట్రేషన్ చేయించలేదు అలాగే 1/3 డబ్బులు కట్టలేదన్నారు. గతంలో కూడా ఇదే వ్యక్తి పాట పాడి వాయిదాల ప్రకారం చెల్లించలేదని తెలిపారు. ఇతడు చాలా ఇబ్బందులకు గురిచేసిన విషయాన్ని పంచాయతీ కార్యదర్శికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సమాధానం చెప్పడం లేదన్నారు. కావున నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వేలం పాటదారుడిపై చర్యలు తీసుకోవాలని, అలాగే వేలంపాటను రద్దు చేయాలని డీపీఓకి గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.