యాదగిరిగుట్ట, అక్టోబర్ 2 : కరువు నేలల్లో జల సిరులు పారించాల్సిన అశ్వరావుపల్లి కాల్వ పనులపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. ఆలేరు నియోజకవర్గంలోని 15వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాలనే ఉద్దేశంలో కేసీఆర్ సర్కారులో అశ్వరావుపల్లి ప్రధాన కుడి కాల్వ పనులు చేపట్టగా, అప్పుడే 80 శాతం మేర పూర్తయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.138 కోట్ల నిధులను మంజూరు చేసి 35.275 కిలోమీటర్ల మేర కాల్వ ఆధునీకరణ, కొత్త పనులు, కాల్వ కట్ట పటిష్టత, కట్ట విస్తరణ, లైనింగ్, స్ట్రక్చర్లు, పూడిక తొలగింపు పనులు చేపట్టింది.
పలుచోట్ల రోడ్లు దాటేందుకు వీలుగా స్ట్రక్చర్ల నిర్మాణం, కెనాల్ క్రాసింగ్ పనులు చేసింది. మిగతా 20 శాతం పనులు పూర్తయితే రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరే అవకాశం ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నది. ఆలేరు మండలంలో భూ సేకరణ చేపట్టి కాల్వ నిర్మించాల్సి ఉండగా, కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన నిధుల్లో జాప్యం కారణంగా పనులు ఆగిపోయాయి. దాంతో కాల్వ చివరి దశలో నిలిచిపోయింది. తాజాగా రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి 2026లోగా అశ్వరావుపల్లి కాల్వ పనులను పూర్తి చేయాలని మరో రెండేండ్లకు గడువు పెంచారు.
అశ్వరావుపల్లి ప్రధాన కుడి కాల్వ ఇలా..
అశ్వరావుపల్లి డిస్ట్రిబ్యూటరీ ద్వారా ఆలేరు నియోజకవర్గలోని ఆలేరు, గుండాల మండలాలకు సాగు నీటిని అందించే విధంగా ప్రతిపాదించారు. జనగామ జిల్లాలోని రఘునాథపల్లి మండలంలోని ఆశ్వరావుపల్లిలో 0.74 టీఎంసీ సామర్థ్యంతో అశ్వరావుపల్లి జలాశయాన్ని నిర్మించారు. అక్కడి మెయిన్ రెగ్యులెటర్ వద్ద ప్రారంభమైన డిస్ట్రిబ్యూటరీ ప్రధాన కుడి కాల్వ ద్వారా 35.275 కిలోమీటర్ల ప్రవహించి ఆలేరు బిక్కేరు వాగులోకి గోదావరి జలాలను విడుదల చేస్తారు. అశ్వరావుపల్లి రిజర్వాయర్ నుంచి ఖిలాషాపూర్, ఇబ్రహీంపురం, మాచారం, యశ్వంత్పూర్, జగానం జిల్లా కేంద్రంలోని నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ సమీపం నుంచి కళ్లెం ప్రాంతానికి వస్తాయి. 34 కిలోమీటర్ల వద్ద గల శారాజీపేట నుంచి టంగుటూరు వెళ్లే దారిని తాకుతాయి. మరో 1.27 కిలోమీటర్లు ప్రవహించిన కాల్వ సాయిగూడెం నుంచి కొల్లూరులోని బిక్కేరు వాగులోకి నీళ్లు వస్తాయి.
80 శాతం పనులు పూర్తి..
ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు ఆలేరు ప్రాంతానికి సాగునీటిని అందించాలని 2006-07 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఆశ్వరావుపల్లి కాల్వను నిర్మించాలని భావించింది. కానీ కాల్వ తవ్వకాల్లో పురోగతి లేకపోవడంతోపాటు ఇంజినీరింగ్ డిజైన్ సరిగ్గా లేదన్న విమర్శలు స్థానికుల నుంచి వెల్లువెత్తాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటిపై తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో ఆశ్వరావుపల్లి జలాశయాన్ని మరింత వేగవంతం చేయాలని నిర్ణయించారు. అందుకనుగుణంగా అశ్వరావుపల్లి ప్రధాన కుడి కాల్వ నిర్మాణానికి అప్పటికే పెరిగిన ధరలను దృష్టితో ఉంచుకుని రూ.138 కోట్ల నిధులు విడుదల చేశారు.
స్టేషన్ ఘన్పూర్, జనగామ, ఆలేరు నియోజకవర్గాల్లో జరుగుతున్న కాల్వ పనులను దృష్టి లో ఉంచుకుని ఈ నిధులు మంజూరు చేశారు. అశ్వరావుపల్లి నుంచి ఆలేరుకు 35.275 కిలోమీటర్ల వరకు ప్రధాన కుడి కాల్వ పనులు 80 శాతం పూర్తయాయి. కాల్వ ఆధునీకరణ, పునర్నిర్మాణం, కాల్వ గట్ల పటిష్టత, అదనపు కట్ట వెడల్పు నిర్మాణం, పూడికతీత, స్ట్రక్చర్ల నిర్మాణం పనులు చివరి దశలో ఉన్నాయి. కిలోమీటర్ల కాల్వ వెడల్పు, మట్టి పనులు పనులు మొత్తం కాల్వ నిర్మాణంలో 70 స్ట్రక్చర్లకు గానూ అన్నీ నిర్మించారు.35.275 కిలోమీటర్ల కాల్వకు గానూ 20.275 కిలోమీటర్ల లైనింగ్ పనులు పూర్తయ్యాయి. మరో 10 కిలోమీటర్ల మేర పనులు పురోగతిలో ఉన్నాయి.
జాతీయ రహదారి దాటేందుకు 14 కెనాల్ క్రాసింగ్లను నిర్మించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలోని మొత్తం 590 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 499 ఎకరాల భూమిని అధికారులు సేకరించారు. మరో 91 ఎకరాల భూ సేకరణ చేపట్టాల్సి ఉంది. ఇందులో 85 ఎకరాలకు సంబంధించిన నిధులు మంజూరు కాగా, కలెక్టర్ ఖాతాలో జమయ్యాయి. ఆలేరు మండలంలోని కందిగడ్డతండాలో భూ సేకరణ జరగాల్సి ఉంది. 2026లో దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టాల్సిన పనులను పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇరిగేషన్ అధికారులకు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. నిధుల మంజూరులో అలసత్వం వహించడంతో కాంట్రాక్టర్ పనుల్లో జాప్యం చేస్తున్నారు.
అందుబాటులోకి వస్తే 15వేల ఎకరాలకు నీళ్లు
అశ్వరావుపల్లి కుడి ప్రధాన కాల్వ పొడువు 34 కిలోమీటర్లు ఉండగా, మరో 1.275 కిలోమీటర్ మేర డిస్ట్రిబ్యూటరీ కాల్వను నిర్మాణం చేపట్టారు. రీచ్-3లో భాగంగా ఆలేరు నియోజకవర్గంలో 10 కిలోమీటర్లు మాత్రమే ప్రధాన కాల్వ ఉంటుంది. రీచ్-2లో భాగంగా 1.50 కిలోమీటర్ల కాల్వ పనులను విభజించారు. ప్రధాన కాల్వతో మొత్తం 10వేల ఎకరాలు, రీచ్-3లో భాగంగా నిర్మాణం చేపడుతున్న డిస్ట్రిబ్యూటరీ కాల్వ ద్వారా గుండాల మండలంలోని అనంతారం, వెల్మజాల వరకు మరో 5 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. రెండు మండలాల్లో మొత్తం 13,154 ఎకరాలు సాగులోకి రాగా, మరో 1,846 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు.