– నీళ్లలోనే ధాన్యం.. ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు
– కేంద్రాల్లోనే తడిచి మొలకెత్తుతున్న ధాన్యం
నకిరేకల్, అక్టోబర్ 24 : అధికారుల నిర్లక్ష్యం రైతుల పారిట శాపంగా మారుతున్నది. నకిరేకల్ మండలంలో కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దయితోంది. 15 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించక పోవడంతో ధాన్యం తడిచి మొలకలు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు వడ్లకు మొలకలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను పండించడం ఒక ఎత్తైతే పంటను అమ్మాలంటే అంతకు మించి కష్ట పడాల్సి వస్తుందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.
నకిరేకల్ మండలంలో ధాన్యం అమ్ముకోవడానికి రైతులు అరిగోస పడుతున్నారు. మండలంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో 7 కేంద్రాలు, ఎన్డీసీఎం ఎస్ ఆధ్వర్యంలో నాలుగు కేంద్రాలు, ఎఫ్ పి ఓ ఆధ్వర్యంలో రెండు కేంద్రాలు మొత్తం 13 కేంద్రాలు ప్రారంభించారు. మరో మూడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉంది. నోముల, వల్లభాపురం, ఓగోడు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తెచ్చి 15 రోజులు అవుతున్నప్పటికీ ఇంకా కేంద్రాలు ప్రారంభించక పోవడంతో అకాల వర్షాలకు రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. గత వారం రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడచి ముద్దవుతుంది. సంబంధిత అధికారులు స్పందించడం లేదని, ఫోన్లు చేస్తే ఎత్తడం లేదని, దురుసుగా సమాధానం ఇస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. 15 రోజుల నుండి రైతులు కొనుగోలు కేంద్రాల వద్దనే పడికాపులు కాస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో అన్నదాతను తుఫాను కోలుకోలేని దెబ్బతీసింది.
ముసురు చేసిన ధాన్యం ఆరబెట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది. తడిచిన ధాన్యం తేమ శాతం తగ్గించడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం కురిసిన వర్షానికి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు టార్పాలిన్లు లేక చిరిగిన పట్టాలతో నానా ఇబ్బందులు పడ్డారు. ధాన్యం కుప్పల వెంట నిలిచిన నీరును పారలతో తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు. పలు కేంద్రాల్లో ధాన్యం కొట్టుకుపోవడంతో వడ్లనే ఎత్తుకునే పరిస్థితి లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుఫాను ప్రభావంపై గత నాలుగు రోజుల ముందే వాతావరణ శాఖ హెచ్చరించినా మండలంలో రైతులకు.. మార్కెటింగ్, సివిల్ సప్లై, రెవెన్యూ, కో ఆపరేటివ్, వ్యవసాయ శాఖల అధికారులు పలు సూచనలు చేయకపోవడం గమనార్హం. ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలు త్వరగా ప్రారంభించాలని, కొనుగోళ్లు వేగవంతం చేయాలని, అవసరమైన టార్పాలిన్లు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

Nakrekal : అధికారుల నిర్లక్ష్యం.. రైతులకు శాపం