హాలియా, ఏప్రిల్ 29 : నాగార్జున సాగర్ నియోజకవర్గంలో దళారులు, మిల్లర్లు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం, ఐకేపీ సెంటర్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో గత్యంతరం లేక రైతులు ధాన్యాన్ని నేరుగా మిల్లులో విక్రయించాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఆరుగాలం కష్టపడి, వేలకు వేలు పెట్టుబడి పెట్టి పంట పండిస్తే పండించిన పంటను విక్రయించేందుకు నానా తిప్పటలు పడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు గిట్టుబాట ధర సంగతి దేవుడెరుగు మద్దతు ధర ఇప్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతులు ఆరోపిస్తున్నారు.
మద్దతు ధర కూడా దక్కని పరిస్థితి
నియోజకవర్గంలో మిల్లర్లు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. మిల్లర్లు కనీసం ప్రభుత్వ మద్దతు ధర కూడా చెల్లించం లేదు. తేమ, తాలు సాకు పేరుతో ధాన్యం కొనుగోలు విషయంలో కొర్రీలు పెడుతున్నారు. గత్యంతరం లేక రైతులు మిల్లర్లు సూచించిన ధరకే ధాన్యం అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. సీజన్ ప్రారంభంలో క్వింటాకు రూ.27 వందలు చెల్లించిన మిల్లర్లు, గత పది పదిహేను రోజులుగా క్వింటాకు రూ.2వేల నుంచి రూ.21 వంద మాత్రమే చెల్లిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం క్వింటాకు రూ.2385ల మద్దతు ధర చెల్లించాలని సూచిస్తే మిల్లర్లు మాత్రం క్వింటాకు రూ.2వేల నుంచి రూ.21వందలు మాత్రమే చెల్లిస్తున్నారు.
బీఆర్ఎస్ హయాంలో..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీజన్ ప్రారంభంలోనే గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేవారు. స్థానిక ఎమ్మ ఎమ్మ ఎమ్మెల్యే అధికారులను మానిటరింగ్ చేసేవారు. రైతులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకునేవారు. ధాన్యం కొనుగోలు దిగుమతితో పాటు రైతులకు కావాల్సిన గోనె సంచులను, లారీలను అందుబాటులో ఉంచేవారు. ఏ మిల్లు యజమాని అయినా రైతుల వద్ద ధాన్యం దిగుమతి చేసుకునేందుకు కోర్రీ పెడితే అధికారులు వెంటనే చర్యలు చేపట్టేవారు. చివరకు తడిసిన ధాన్యం సైతం ప్రభుత్వం రైతుల వద్ద కొనుగోలు చేసి మిల్లర్లు దిగుమతి చేసుకునేలా వత్తిడి తెచ్చేవారు.
సమీక్షల్లేవు..చర్యల్లేవు..
సీజన్ ప్రారంభమై పక్షం రోజులు దాటినా ధాన్యం కొనుగోలు విషయమై స్థానిక ఎమ్మెల్యే ఇప్పటి వరకు సమీక్ష నిర్వహించిన దాఖలాలు లేవు.అలాగే ఎమ్మెల్యే ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతులతో మాట్లాడి వారి కష్ట నష్టాలు తెలుసుకున్న పాపాన పోలేదు. ఎమ్మెల్యేకు వ్యవసాయం, రైతుల కష్టాలపై అవగాహన లేదని, గడిచిన రెండున్నరేండ్ల కాలంలో ఎమ్మెల్యే, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సందర్భాలే లేవని బీఆర్ఎస్ నేతలు, రైతు సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు.
తరుగు పేరుతో దోపిడీ..
ఐకేపీ నిర్వాహకులు వాస్తవానికి బస్తా బరువు కలిపి బస్తాకు 40కేజీల 600 గ్రాముల చొప్పు న ధాన్యం కాంటా వేయాల్సి ఉంది. కానీ సాగర్ నియోజకవర్గంలోని ఐకేపీ నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మకై ఐకేపీ కేంద్రాల్లో 42 కేజీలు కాంటా వేస్తున్నారు. మిల్లర్లు సైతం 42 కేజీలు కాంటా వేస్తేనే దింపుకుంటున్నారు. 42 కేజీల కన్నా తక్కువ వేస్తే మిల్లర్లు ఐకేపీ కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడం లేదు. తరుగు పేరుతో మిల్లర్లు రైతుల వద్ద క్వింటాకు 5 కేజీల చొప్పు న దోపి డీ చేస్తున్నారు. గుర్రంపొడు మండలంలో తా లు సాకుతో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇదే విషయమై రైతులు, రైతు సం ఘం నేతలు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు.
అధికార పార్టీ నేతలతో.. మిల్లర్లు కుమ్మక్కు
నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు అధికార పార్టీ నేతలు కుమ్మక్కు అయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. రైసు మిల్లర్లకు, కాంగ్రెస్ పార్టీ నేతలకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఎన్నికల సమయంలో మిల్లర్లు అధికార పార్టీకి ముడుపులు చెల్లించడంతో ధాన్యం కొనుగోలు, రైతులకు గిట్టుబాటు ధర చెల్లింపు విషయంలో అధికార పార్టీ నేతలు మిల్లర్లపై ఎటువంటి వత్తిడి తేలేకపోతున్నారని రైతులు, రైతు సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నెల 19న నియోజకవర్గ పర్యటనకు వచ్చిన మాజీ మంత్రి తన్నీరు హారీశ్‌రావు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
జిల్లాలో మంత్రి, ఎమ్మెల్యేలు అంతా కూర్చోని మిల్లర్లతో సమావేశమైన తరువాత ధాన్యానికి ధర పెరగాల్సింది పోయి మిల్లర్లు ధర తగ్గించారని, దీని వెనుక ఉన్న మతలబు ఏంటని ప్రశ్నించారు. జిల్లాతో పాటు నియోజకవర్గంలోని మిల్లర్లు రైతులకు ధర తగ్గించి ఎమ్మెల్యేకు కమీషన్ ఇస్తున్నారని ఆరోపించారు. సీజన్ ప్రారంభంలో క్వింటాకు రూ.2700లు చెల్లించిన మిల్లర్లు ప్రస్తుతం క్వింటాకు రూ.2 వేలు మాత్రమే చెల్లిస్తున్నా కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎంపీలు నోరు మెదపకపోవడంపై నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలో మెజార్టీ రైసు మిల్లర్లంతా అధికార పార్టీ నేతలవే కావడం, వారికి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, మాజీ సీఎల్పీ నేతతో సత్ససంబంధాలు ఉండటమే కారణమని, దీంతో మిల్లర్లు ఎంత దోపిడీ చేసినా అధికారులు ఎవరూ మిల్లలు వైపు కన్నెతి కూడ చూడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం..
ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకు పోయాయి. ధాన్యం కొనుగోలు చేయడంతో విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. క్వింటాకు 5 కిలోల తరుగు తీస్తున్నారు. అధికారులు, అధికార పార్టీ నేతలు అంతా మిల్లర్లకే మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో మిల్లర్ల దోపిడీకి అడ్డు లేకుండా పోతోంది.
-నాగులవంచ తిరుపతిరావు, గుర్రంపోడు
మితిమీరుతున్న మిల్లర దోపిడీ..
నియోజకవర్గంలో రైతులను మిల్లర్ల నిలువు దోపిడీ చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే మిల్లర్లు అడ్డికి పావుసేరు చొప్పున అడుగుతున్నాడు. మిల్లర్లు కనీసం రైతులకు మద్దతు ధర చెల్లించడం లేదు. అధికార పార్టీ నేతలు మిల్లర్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి రైతు సంక్షేమాన్ని విస్మరిస్తున్నారు.
-పిల్లి వెంకట్, యువరైతు, అనుముల మండలం