దేవుడు వరమిచ్చినా.. పూజారి కనికరించని అన్న చందంగా ఉంది నందనం నీరా ప్లాంట్ పరిస్థితి. కల్లు గీత కార్మికులకు భరోసా ఇచ్చే నీరా కేంద్రంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నా పట్టించుకోవడంలేదు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించడంతోనే అలసత్వం ప్రదర్శిస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నెల 8న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఇప్పటికైనా ప్రారంభించాలని గీతన్నలు కోరుతున్నారు.
– యాదాద్రి భువనగిరి, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ)
భువనగిరి మండలంలోని నందనం గ్రామంలో నీరా ప్లాంట్ ఏర్పాటు చేయాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సంకల్పించింది. గీత కార్మికులకు ఆసరాగా నిలవడంతోపాటు ప్రజలకు నీరా అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఆ మేరకు నందనంలో నాలుగు ఎకరాల్లో భవనం నిర్మించేందుకు రూ.8కోట్లు విడుదల చేసింది. 2022 జూలై 29న అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్, నాటి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నీరా కేంద్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గతేడాది ఆగస్టులోనే భవన నిరాణాలు పనులన్నీ పూర్తయ్యాయి. నీరా కేంద్రం నిల్వకు అవసరమైన వివిధ రకాల యంత్రాల అమర్చారు.
సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 8న జిల్లాలో పర్యటించనున్నారు. తన జన్మదినం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో మూసీ పరివాహక ప్రాంతానికి చేరుకుని, వలిగొండ మండలంలోని సంగెం వద్ద యాత్ర చేపట్టనున్నారు. ఆ మార్గంలోనే నందనం నీరా ప్లాంట్ ఉంటుంది. రోడ్డు మీది నుంచి చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది. అదే దారిలో వెళ్తున్న రేవంత్ రెడ్డి మార్గమధ్యలో ఉన్న నీరా ప్లాంట్‌ను ప్రారంభించాలనే డిమాండ్లు వస్తున్నాయి. అందుకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చొరవ తీసుకోవాలని గీత కార్మికులు కోరుతున్నారు.
రాష్ట్రంలోనే తొలిసారిగా నీరా ఉత్పత్తి కేంద్రం నందనంలో ఏర్పాటైంది. ఇది అందుబాటులోకి వస్తే.. నీరాను ఉదయాన్నే చెట్టు నుంచి తీసి నందనం ప్లాంట్‌కు తీసుకొస్తారు. నీరా కల్లుగా మారకుండా ఇక్కడే ప్రాసెస్ చేస్తారు. రోజూ రెండు వేల లీటర్ల నీరా కేంద్రానికి వచ్చే అవకాశం ఉంది. దాన్ని ఇక్కడే నిల్వ చేస్తారు. పులియకుండా, పాడవకుండా పాశ్చరైజేషన్ చేస్తారు. ఇక్కడి నుంచే ప్యాక్డ్ నీరాను హైదరాబాద్ కేఫ్తోపాటు ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తారు. సేకరణ, స్టోరేజీలు, ప్యాకింగ్, రవాణా నందనం నుంచే జరుగుతుంది. నీరా అనుబంధ ఉత్పత్తులను కూడా తయారు చేసే వీలుంటుంది. తాటి బెల్లం, చక్కెర, చాక్లెట్లు, తేనె వంటి 18రకాల వస్తువులను తయారు చేసే అవకాశం ఉంది. దాంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
1993 నవంబర్ 13న మాజీ మంత్రులు గాదె వెంకట్‌రెడ్డి, కె.జానారెడ్డి నందనంలో రూ.70లక్షల అంచనా వ్యయంతో తాటి ఉత్పత్తుల కేంద్రాన్ని ప్రారంభించారు. కానీ అది ముందుకు కొనసాగలేదు. దశాబ్దాలుగా మూతబడిన నందనం తాటి ఉత్పత్తుల కేంద్రంలో నీరా ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు గత బీఆర్ఎస్ సర్కారు ముందుకు వచ్చింది. ఆరోగ్యానికి మేలు చేసే నీరా ఉత్పత్తి ద్వారా గీత వృత్తిదారులను ఆదుకోవాలని నాటి సీఎం కేసీఆర్ భావించారు. ఈ నేపథ్యంలో ప్రజలకు నీరా అందుబాటులోకి తేవాలని అనుకున్నారు. అభాగంగా తాటి వనాలు అధికంగా ఉన్న భువనగిరి మండలంలోని నందనంలో నీరా ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ప్రారంభించడం లేదు. దీనిపై కనీసం రివ్యూ కూడా చేయలేదు. నీరా ప్లాంట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆసక్తి చూపించడం లేదనే విమర్శలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేయడంతో ప్రారంభిస్తే.. కేసీఆర్, బీఆర్ఎస్కు పేరొస్తుందనే పెండింగ్‌లో పెట్టారనే ప్రచారం జరుగుతున్నది.