దేవరకొండ రూరల్, డిసెంబర్ 05 : బీసీ రిజర్వేషన్ల కోసం అమరుడైన సాయి ఈశ్వరాచారి చిత్రపటానికి దేవరకొండ పట్టణంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సామాజికవేత్త, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించకపోవడం వల్ల యువత విద్యా, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో ప్రాతినిధ్యం కోల్పోవడంతో దిగ్భ్రాంతికి గురై ఆత్మహుతి చేసుకోవడం బాధాకరం అన్నారు.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం బీసీ రిజర్వేషన్స్ విషయంలో కట్టుబడి ఆత్మహుతులను ఆపి, రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు తక్షణమే వాయిదా వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చోల్లేటి భాస్కరాచారి, రెడ్డి కోటేశ్వరరావు, పున్న వెంకటేష్, రంజాన్ బేగ్, డాక్టర్ భాషా చౌహన్, కొండపల్లి శీను, దామెర సామ్సంగ్, సుధాకర్ ఆచారి, శివ పాల్గొన్నారు.