నీలగిరి, జూన్ 16 : నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా చింతకుంట నారాయణరెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ప్రస్తుత కలెక్టర్ దాసరి హరిచందన బదిలీ కావడంతో వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్న నారాయణరెడ్డి జిల్లాకు బదిలీపై వచ్చారు. ఈ మేరకు ఆదివారం కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ చాంబర్లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ముందుగా జిల్లా కేంద్రానికి చేరకున్న నారాయణరెడ్డికి ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్ద రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఆర్డీఓ రవి, స్థానిక తాసీల్దార్ శ్రీనివాసులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.
అనంతరం కలెక్టర్ కార్యాలయానికి చేరుకోగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.పూర్ణచంద్ర, కలెక్టరేట్ ఏఓ మోతీలాల్ పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో సమాచార శాఖ సహాయ సంచాలకులు యు.వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఈఈ భూమయ్య, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వర్రావు, మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ సీసీలు ప్రసాద్, కరుణాకర్‌రెడ్డి ఉన్నారు.