సూర్యాపేట టౌన్, మే 9 : ‘ప్రజలు భయపడాల్సిన పనిలేదు. మన రక్షణ రంగం ఎంతో బలోపేతమైంది. పాక్‌తో యుద్ధం రోజుల వ్యవధిలోనే ముగుస్తుంది.’ అని సూర్యాపేట జిల్లా మునగాల మండలం విజయరాఘవాపురం గ్రామానికి చెందిన కల్నల్ సుంకర శ్రీనివాసరావు అన్నారు. భారత సైన్యానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అండగా ఉండేందుకు తాము సిద్ధమని చెప్పారు. 1988 నుంచి 2021 వరకు ఇండియన్ ఆర్మీలో పని చేసి లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉద్యోగ విరమణ పొందిన శ్రీనివాసరావు.. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. నాటి యుద్ధ పరిస్థితిని, అనుభవించిన బాధలను, ప్రజల కోసం ఎలా రక్షణగా నిలిచారు. ప్రస్తుతం జరుగుతున్న ఆపరేషన్ సింధూర్ విజయవంతానికి కారణాలను, ప్రజల బాధ్యతను నమస్తే తెలంగాణకు వివరించారు. అవి ఆయన మాటల్లోనే..
నేను పని చేస్తున్న సమయంలో 1999లో కార్గిల్ యుద్ధం జరిగింది. నాడు రక్షణ రంగం బలంగా లేకున్నా ఆయుధాలు తక్కువగా ఉన్నప్పటికీ పాకిస్తాన్‌పై వీరోచితంగా పోరాడి విజయం సాధించాం. కార్గిల్ యుద్ధంలో డ్రోన్ టెక్నాలజీ, యాంటీ మిసైల్ డిఫెన్స్ సెక్యూరిటీ బలంగా లేదు. మనకు ఉన్న అగ్ని, ఆకాశ్ మిసైల్స్ అన్నీ గత 20 ఏండ్లల్లో తయారు చేశారు. మన సాంకేతిక రక్షణ రంగం డీఆర్డీఏ, డీఆర్ఎంఎల్, ఆర్డీఏ ప్రభుత్వ పరిశోధన రంగ సంస్థలన్నీ హైదరాబాద్‌లోని డిఫెన్స్ విభాగాలు.. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రేరణతో ఆయన నాయకత్వంలో క్షిపణులు, రాకెట్లు రోదసీలోకి పంపేందుకు డిజైన్ చేయడం నేర్చుకున్నారు. ఫోక్రాన్ యుద్ధం న్యూక్లియర్ బాంబు పేలుడు తరువాత మన సాంకేతిక రంగాన్ని అభివృద్ధి చేసుకొని ఫారెన్ టెక్నాలజీతో మన దేశ రక్షణ సంస్థలు బీడీఎల్, ఎస్ఈఎల్, బీఈఎల్ మిసైల్స్‌ను తయారు చేస్తున్నాయి. రంగంలో పటిష్టంగా, పకడ్బందీగా పాకిస్తాన్‌పై డ్రోన్లను తిప్పికొడుతూ యాంటీ మిసైల్స్ స్కాడ్స్ చేస్తున్నామంటే మన రక్షణ రంగం సాకేతికంగా అభివృద్ధి చెందడం వల్లే. దాంతోపాటు త్రివిధ దళాలు సమాన దృష్టితో, సమతుల్యంతో భారత ప్రభుత్వం గాలి, నీరు, భూమిపై మూడు విభాగాలను పటిష్టంగా తయారు చేసింది. పాకిస్తాన్‌తో ఏదో ఒకరోజు ఇలాంటి త్రెట్ వస్తుందని తెలుసు. మనకు మనం పటిష్టంగా ఉండాలనే ఆలోచనతో పదేండ్లలో యాంటీ డ్రోన్లు, యాంటీ మిసైల్స్ తయారు చేసుకోవడమే ఈ రోజు మన విజయానికి కారణం.
భారతదేశం పాకిస్థాన్‌తో చేసే యుద్ధం కొన్ని రోజులు, వారాలు మాత్రమే. నెలలు కూడా పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు పాక్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉంది. పాక్ ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వం, సైన్యం మూడూ గాడి తప్పాయి. రష్యా, ఉక్రెయిన్ మాదిరిగా పాశ్చాత్య దేశాలు పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. దుబాయ్, చైనాతో కలుపుకొని ఏదో చేయాలని చూస్తే భారతదేశం పాకిస్తాన్‌ను ప్రపంచం దృష్టిలో ఏకాకిని చేసే ఉద్దేశమే ఈ దౌత్యం. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇటలీ, ఇజ్రాయిల్ ప్రపంచ అగ్రగామి దేశాలన్నీ మన వెంట ఉన్నాయి. ఈ సమయంలో పాకిస్థాన్‌కు చైనా మద్దతు ఇచ్చి యుద్ధ సామగ్రి, ఆర్థికంగా సహకరిస్తే.. రేపు 140కోట్ల మంది భారతీయులు చైనా వస్తువులను బహిష్కరిస్తే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. అందుకే చైనా ఎట్టిపరిస్థితుల్లోనూ పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వదు. బార్డర్లో మీరున్నారు.. బార్డర్ బయట మేమున్నామని భారత ప్రభుత్వానికి, రక్షణ రంగానికి మద్దతు తెలుపాలి. సైనికులు ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా యుద్ధ్దం చేయాలని సామాన్య ప్రజలు కూడా భయాందోళన చెందకుండా స్లీపర్ సెల్స్ యాక్టివ్ కాకుండా మన ప్రాంతాలను మనమే రక్షించుకోవాలి. మన పోలీసు, రక్షణ వ్యవస్థకు సమాచారం అందించి సహకరిస్తూ ఇంటర్నల్ ఎటాక్‌లకు చెక్ పెట్టాలి.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నేటికీ రాష్ర్టానికి హోం శాఖను కేటాయించలేదు. మాజీ సైనికుల సమస్యలపై ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. దేశం కోసం పాటుపడిన సైనికుల సమస్యలను పరిష్కరించకున్నా వారికి కాసేపు సమయం ఇచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం మ మ్మల్ని మరిచినా.. మేం మా బాధ్యతను మరు వం. భారతదేశ సైన్యానికి, ప్రజలకు ఎప్పుడు ఎలాంటి ఆపద వచ్చినా ప్రత్యక్షంగా, పరోక్షంగా పోరాడేందుకు మాజీ సైనికులమంతా సిద్ధంగా ఉంటాం.
శ్రీనివాసరావు 1988నుంచి 2004 ఇండియన్ ఆర్మీ (కార్స్ ఆఫ్ సిగ్నల్స్)లో చేరి ఇండియన్ మిలటరీ అకాడమీ నుంచి డెహ్రడూన్‌కు లెఫ్టినెంట్ కమిషన్ అయ్యారు. 2005నుంచి 2006 వరకు దేశంలోని ఐదు రాష్ర్టాలైన నార్త్ ఈస్ట్‌లో కంపెనీ కమాండర్‌గా కౌంటర్ ఎమర్జెన్సీ ఏరియాల్లో లెఫ్టినెంట్ అండ్ కెప్టెన్ ర్యాంకుల్లో పనిచేశారు. 2007లో హైదరాబాద్‌లో జరిగిన 3వ మిలటరీ వరల్డ్ గేమ్స్ పోటీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెప్టెన్ ర్యాంకులో పని చేశారు. 2007-08లో నాగపూర్‌లోని కాంప్టీలో జడ్జి అడ్వకేట్ జనరల్ బ్రాంచి ఇండియన్ మిలటరీ లా ఇన్స్టిట్యూట్ నుంచి పట్టభద్రుడయ్యారు. 2006 నుంచి 2009 వరకు అడ్మినిస్ట్రేటివ్ కేడర్‌లో కెప్టెన్, మేజర్‌గా పనిచేశారు. 2009 నుంచి 2011 వరకు మిషన్ ఒలింపిక్స్ కోసం మేజర్, శిక్షణాధికారిగా పూణెలో ఇండియన్ అర్మీ మిషన్ ఒలింపిక్ వింగ్ కోసం ఆఫీసర్ ఇన్చార్జిగా పని చేని 20వేల మంది సైనికులకు శిక్షణ ఇచ్చారు. 2015నుంచి 2017వరకు లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో శారీరక శిక్షణ, క్రీడల అధికారిగా గ్రానేడియర్స్ రెజిమెంటల్ సెంటర్లో బోధకుడిగా పని చేశారు. 2017-21 మధ్య లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఆర్మీ ఆర్డెన్స్ ట్రైనింగ్ సెంటర్లో ఫిజికల్ ట్రైనింగ్ సెంటర్లో ఫిజికల్ ట్రైనింగ్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్‌గా పని చేసి 35వేల మంది సైనికులకు శిక్షణ ఇచ్చారు.