రామగిరి (నల్లగొండ), మార్చి 31 : నల్లగొండ జిల్లా మత సామరస్యానికి పెట్టింది పేరని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రం మునుగోడు రోడ్డులో గల ఈద్గాలో ముస్లింలతో కలిసి ప్రార్థనల్లో పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం మత పెద్ద మౌలానా ఎస్సానుద్దీన్ ఖురాన్ లోని అంశాలను వివరించి ప్రార్థనలు చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి ఎంతోమంది ముస్లింలు కృషి చేశారని, అందులో అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా, సైంటిస్ట్ గా చేసిన సేవలు మరువలేనివన్నారు. నల్లగొండ జిల్లా మత సామరస్యానికి పేరని, హిందూ ముస్లింలు కలిసి నల్లగొండ పట్టణాన్ని అభివృద్ధి చేసుకొనేందుకు సహకరించాలని కోరారు. నల్లగొండ పట్టణంలోని దర్గాలు, ఈద్గాల అభివృద్ధికి తాను 25 ఏండ్లుగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడి ఈద్గా తెలంగాణలోనే అతిపెద్ద ఈద్గా అన్నారు. ఇటీవల నల్లగొండలో నిర్వహించిన ఇస్తేమాలో సుమారు 40 నుంచి 50 వేల మంది పాల్గొన్నా ఎలాంటి సమస్య లేకుండా తాగునీరు, అన్ని సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు.
ముఖ్యంగా లతీఫ్ సాబ్ దర్గాకు ప్రతి సంవత్సరం నిర్వహించే ఉర్సు, ఇతర ఉత్సవాల సందర్భంగా లక్షల మంది వస్తారని, పెద్దవారు, ముసలివారు గుట్ట ఎక్కలేరని, దీన్ని దృష్టిలో ఉంచుకొని లతీఫ్ సాబ్ దర్గాకు 100 కోట్ల రూపాయలతో ఘాట్ రోడ్ నిర్మిస్తున్నామని , టెండర్లు పూర్తయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. లతీఫ్ షాప్ గుట్ట నుండి బ్రహ్మంగారి గుట్ట వరకు రోప్ వే నిర్మిస్తున్నామని, బ్రహ్మంగారి గుట్టకు కూడా వేరే ఘాట్ రోడ్ వేయిస్తున్నామని, 500 కోట్లతో కొత్త బైపాస్ రోడ్ టెండర్లు వేయడం జరిగిందని, వారం రోజుల్లో పనులు మొదలు కానున్నట్లు తెలిపారు.
నల్లగొండలో ముస్లింల సంక్షేమం, అభివృద్ధిలో భాగంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ, మెడికల్ కళాశాల, కలెక్టరేట్ తదితర ప్రభుత్వ సంస్థల్లో అవుట్ సోర్సింగ్, కాంటాక్ట్ పద్ధతిపై అర్హులైన ముస్లిం అభ్యర్థులను నింపేందుకు 10 శాతం రిజర్వేషన్ కల్పించేలా జిల్లా కలెక్టర్ కు ఇదివరకే ఆదేశించడం జరిగిందన్నారు. దీంతో పాటు పేద ముస్లింలకు ఇండ్లు కట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నల్లగొండ పట్టణం సమీపంలో పేదవారికి ఇండ్ల నిర్మాణానికి భూమిని గుర్తించడం జరిగిందని, ప్లాట్లు లేని వారికి ప్లాట్లు ఇచ్చి రూ.5 లక్షలతో ఇల్లు కట్టిస్తామని, ప్లాట్లు ఉంటే నేరుగా ఇల్లు కట్టించడం జరుగుతుందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, అదనపు కలెక్టర్ జే.శ్రీనివాస్, ఆర్డిఓ అశోక్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్ గౌడ్ , ఈద్గా కమిటీ సభ్యుడు హఫీజ్ ఖాన్, పలువురు అధికారులు, ప్రముఖులు, ముస్లిం పెద్దలు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.
Ramadan : మత సామరస్యానికి పెట్టింది పేరు నల్లగొండ : మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి