నీలగిరి, ఫిబ్రవరి 27 : నల్లగొండ పట్టణాన్ని అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలుపుతామని మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో సోమవారం జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలో రోడ్ల విస్తరణ, జంక్షన్లు, పాతబస్తీ ఆధునీకరణ, నాలుగు లైన్ల రోడ్లు సెంట్రల్ లైటింగ్‌లతో పాటు పలు రకాల అభివృద్ధి పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయనున్నట్లు చెప్పారు. రూ.133 కోట్లతో ఉదయ సముద్రం టూరిజం స్పాట్‌గా చేయడం, తీగల వంతెన నిర్మాణం, రూ.90 కోట్ల కళాభారతి లాంటి అభివృద్ధ్ది కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. పట్టణంలో ఎన్‌హెచ్-65 రహదారి ఉన్న పానగల్ బైపాస్ వద్ద బ్రిడ్జి నిర్మిస్తామని, అదే తరహాలో మర్రిగూడ బైపాస్ వద్ద రూ.48 కోట్లతో ఫ్లైఓవర్ పనులను మరో వారం రోజుల్లో చేపట్టనున్నట్లు తెలిపారు.
పాతబస్తీలోని పూల్ నుంచి జీఎల్ గార్డెన్ వరకు 80 ఫీట్ల రోడ్డును కూడా ఆధునీకరించనున్నట్లు తెలిపారు. సీనియర్ కౌన్సిల్ సభ్యుడు కొండూరు సత్యనారాయణ మాట్లాడుతూ పట్టణంలో జరగుతున్న డబుల్బెడ్రూం ఇండ్ల లబ్ధ్దిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. పలువురు సభ్యులు సమస్యలను సభదృష్టికి తీసుకరాగా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవీ రమణాచారి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, ఫ్లోర్ లీడర్లు అభిమన్యు శ్రీనివాస్, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, బండారు ప్రసాద్, కౌన్సిలర్లు పిల్లి రామరాజు, ఎడ్ల శ్రీనివాస్, బోయినపల్లి శ్రీనివాస్, గోగుల శ్రీనివాస్, సమీ, బొజ్జ మల్లికానాగరాజు, ఉట్కూరి వెంకట్‌రెడ్డి, జమాల్‌ఖాద్రి, ఖయ్యుంబేగ్, గున్రెడ్డి రాధికాయుగేంధర్రెడ్డి, కంచర్ల తేజశ్రీరంజిత్, అదనపు కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ పాల్గొన్నారు.