నల్గొండ విద్య విభాగం (రామగిరి) మార్చి 7: నల్గొండ జిల్లాలో 2024 ఏప్రిల్ నెలలో ఎస్సెస్సీ స్పాట్ వాల్యుయేషన్‌లో ఏఈ, సీఈ, స్పెషల్ అసిస్టెంట్, ఇతర విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు ఏడాది గడుస్తున్నా నేటికీ రెమ్యూనరేషన్ , టీఏ., డీఏలు చెల్లించలేదని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (TRTF) నల్లగొండ జిల్లా శాఖ తెలిపింది. గత ఏడాది ఎస్సెస్సీ స్పాట్ విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు వెంటనే రెమ్యునరేషన్ డబ్బులు సత్వరం చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నిమ్మనగోటి జనార్దన్, తరాల పరమేశ్ యాదవ్ వినతిపత్రం అందజేశారు. ఎంఈవో అందుబాటులో లేకపోవడంతో జిల్లా పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ యూసుఫ్ షరీఫ్‌కు శుక్రవారం సాయంత్రం వినతిపత్రం ఇచ్చారు.
రెమ్యూనిరేషన్ డబ్బులు తక్షణం చెల్లించాలి
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన ఎస్సెస్సీ పరీక్షలు ఏప్రిల్ మొదటి వారంలో పూర్తి కానున్నాయని తెలిపారు. ఆ వెంటనే మూల్యాంకనం కూడా ప్రారంభం కానున్నదని అన్నారు. కాగా గత సంవత్సరానికి సంబంధించిన రెమ్యూనరేషన్ ఇంకా చెల్లించని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పాట్ విధులు నిర్వహించడం పట్ల చాలామంది ఉపాధ్యాయులు ఆవేదనలో ఉన్నారని, ఈ నేపథ్యంలో రెమ్యునరేషన్ డబ్బులు సత్వరం చెల్లించని పక్షంలో ఉపాధ్యాయుల మనోభావాలను పరిగణనలోకి తీసుకొని ఈ సంవత్సరం ఎస్సెస్సీ స్పాట్ విధుల బహిష్కరణకు TRTF సంఘ పక్షాన అనివార్యంగా పిలుపు ఇవ్వవలసి వస్తుందని తెలియజేశారు.